స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరమాంకంలో 'నరకం' అనుభవించారు. కుటుంబానికి దూరమై, రాజకీయంగానూ ఒంటరై.. స్వర్గీయ ఎన్టీఆర్ అనుభవించిన క్షోభ ప్రపంచానికి తెలుసు. 'నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశాడు' అంటూ స్వర్గీయ ఎన్టీఆర్, మీడియా ముందుకొచ్చి కంటతడి పెట్టారు. అయినాగానీ, 'పుత్రరత్నాలు' కనికరించలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ తుది శ్వాస విడిచాక, చంద్రబాబు ఇంకా తెలివిగా 'కుటుంబమంతటినీ' తనవైపుకు తిప్పేసుకున్నారు.. ఒక్క లక్ష్మీ పార్వతిని తప్ప. అసలంటూ సమస్యే లక్ష్మీ పార్వతి కదా, చంద్రబాబు దృష్టిలో.!
ఇప్పుడిక, 'ఎన్‌టిఆర్ మహానాయకుడు' కూడా ఒంటరి అయిపోయింది. థియేటర్లలో సినిమా పరిస్థితి దారుణంగా తయారైంది. రెండు పార్టులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా బాలకృష్ణ 'ఎన్‌టిఆర్ బయోపిక్'ని నిర్మించినా, కథానాయకుడు – మహానాయకుడు ఒకదానితో ఒకటి పోటీ పడాల్సి వచ్చింది పరాజయం విషయంలో. కాస్తో కూస్తో కథానాయకుడే బెటరన్నట్టుంది పరిస్థితి ఇప్పుడు. అత్యంత ఘోరమైన వసూళ్ళను తొలి రోజు చవిచూసిన మహానాయకుడు, రెండో రోజు థియేటర్లలో జనం లేక ఇంకా దారుణంగా వెలవెలబోయింది.
సినిమా అనేది 'వ్యాపారం'. ఇక్కడ జయాపజయాలు సహజం. కానీ, బాలకృష్ణ ఈ సినిమా గురించి చెబుతూ, 'ఇది సినిమా కాదు, స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం' అన్నాడు చాలా ఇంటర్వ్యూల్లో. జయాపజయాల గురించి ఆలోచించకుండా సినిమా తెరకెక్కించానన్నాడు. అవునా? అలాగైతే సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సింది పోయి, బయ్యర్లకు ఎందుకు అమ్మి, సొమ్ము చేసుకున్నట్టు.? ఈ ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.
స్వర్గీయ ఎన్టీఆర్‌ని రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఇప్పటికీ ఆ ఎన్టీఆర్ ఫొటో పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారు. బాలయ్య తక్కువేమీ తిన్లేదు, 'అన్నగారి బయోపిక్' అంటూ, తన తండ్రి సినీ – రాజకీయ ప్రస్థానాన్ని సినిమాగా తెరకెక్కించి అడ్డగోలుగా అమ్మేసుకున్నారన్న అభిప్రాయాలు.. అన్నగారి 'నిజమైన' అభిమానులనుంచి వ్యక్తమవుతున్నాయి. 'ఈ విషయంలో చంద్రబాబుకీ, బాలయ్యకీ తేడా ఏమీ లేదు' అంటూ సోషల్ మీడియాలో అన్నగారి అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.
రాజశేఖర్‌రెడ్డికి సినీ నేపథ్యం లేదు. అసలంటూ రాజశేఖర్‌రెడ్డి జీవితం మొత్తాన్నీ 'యాత్ర' బయోపిక్‌లో రూపొందించలేదు. కానీ, 'యాత్ర' ఫర్వాలేదన్పించింది ఎన్టీఆర్ బయోపిక్‌తో పోల్చితే. పైగా, 'యాత్ర'కి టాలీవుడ్ ప్రముఖుల నుంచి మద్దతే లభించలేదు. కానీ, గెలిచింది. వైఎస్సార్ మీద దర్శకుడికీ, నిర్మాతకీ వున్న గౌరవం, అభిమానం.. అవన్నీ ఆ సినిమా అలా తెరకెక్కడానికి కారణమయ్యాయి. కానీ, ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అలా ఎందుకు జరగలేదు.? ఏమోగానీ, ఇది స్వర్గీయ ఎన్టీఆర్‌కి మరో అవమానం.. దీన్ని కూడా వెన్నుపోటు అనొచ్చా.?