ఫ్యాన్స్ సేఫ్ కోసం బాహుబలి ఆడియో ఫంక్షన్ వాయిదా వేస్తున్నట్లు చెప్పేసారు రాజమౌళి సారు. పోలీసులు పాతిక వేల మంది వరకే కెపాసిటీ వుంటుదట, పర్మిషన్ దొరికినా, మిగిలిన వారిని గేటు బయట నిలబెట్టడం భావ్యమా అన్న ఆలోచనతో, చేసి వాళ్లని డిస్సప్పాయింట్ మెంట్ చేయడం ఇష్టం లేక వాయిదా వేసామని ఆయన చెప్పారు. ప్రభాస్ ను రెండేళ్లుగా చూడని ఫ్యాన్స్, భయంకరంగా వచ్చేస్తారని, వారిని బయట నిల్చోపెట్టడం ఇష్టం లేక ఇలా వాయిదా వేసామని అంటున్నారు.
ఫ్యాన్స్ దగ్గరకు ప్రభాస్ ను తీసుకెళ్లడమా, లేదా ఫ్యాన్స్ నే హైదరాబాద్ రప్పించడమా అన్నది ఆలోచిస్తున్నామన్నారు. ఫ్యాన్స్ శాటిస్ ఫాక్షన్ కోసమే ఇలా వాయిదా వేసామని హీరో ప్రభాస్ కూడా అన్నారు.
ఇవన్నీ చూస్తుంటే రాజమౌళి అండ్ కో మరీ కాస్త ఎక్కువ ఊహించుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఇప్పటికి మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల ఫంక్షన్లు ఎన్నో జరిగాయి. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా, గతంలో ఇదే హైటెక్స్ లో సినిమా ఫంక్షన్లు జరిగాయి. మరి ఇప్పుడేమొచ్చె. పైగా పోలీసులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నామని, అందుకే ఓకె అని వాయిదా వేసామని అంటున్నారు. అన్ని ప్రాంతాల వారు తమ తమ ప్రాంతాల్లో జరపమని కోరుతున్నారని, ఎక్కడన్నా ఇదే సమస్య అవుతుంది అంటున్నారు రాజమౌళి.
ప్రభాస్ ఫ్యాన్..రెండేళ్లుగా చూడలేదు..వెల్లువలా వస్తారు. నిజమే అంతమాత్రాన మరీ లక్షల్లో వచ్చేస్తారా? ఎన్టీఆర్, వైఎస్ఆర్, ఇంకా ఎందరో జాతీయ నాయకులు ఆంధ్రలో , హైదరాబాద్ లో భారీ సభలు నిర్వహించారు. లక్షల్లో జనం వచ్చారు. వాటికన్నా గొప్ప ఫంక్షన్ ఏమీ కాదు కదా? ఇప్పుడు తెలుగుదేశం మహానాడుకు ముఫై అయిదువేల మందికి ఏర్పాట్లు చేసారు. ఏమయింది?
పోనీ మరి ఇంతటి అంచనా వున్నపుడు, ఏకంగా నూతన రాజధాని ప్రాంతంలో 17 వేల ఎకరాలు సేకరించి వుంచారు. అక్కడ చేయచ్చుగా. అందునా సినిమా ఎవరిది? కే. రాఘవేంద్రరావు గారిది. ఆయనేమో చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు. అందువల్ల అక్కడ ప్రభుత్వం అండగా వుంటుంది..పోలీసు వ్యవస్థ పూర్తిగా సహకరిస్తుంది.
అంటే అసలు వైనం ఏదో వుంది. పోలీసులు వారి ముందు జాగ్రత్తగా ఇంతకు కటాఫ్ చేయండి జనాల సంఖ్య అని ఇచ్చి వుంటే వుండోచ్చు. అది వారి ముందు జాగ్రత్త. కానీ వీరికి కూడా వాయిదా వేయాలని వుందని, అందుకే ప్రస్తుతానికి ఫ్యాన్స్ పై నెపం పెట్టి వాయిదా వేసారని వినికిడి, అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికి తయారైన మూడు ట్రయిలర్లు కూడా రాజమౌళికి సంతృప్తిని ఇవ్వలేదని వినికిడి.
ఇంత రేంజ్ హైప్ వచ్చిన తరువాత ట్రయిలర్ ఏమాత్రం తేడాగా వున్నా, పరిస్థితి వేరుగా వుంటుంది. పైగా ఆడియోకి విడుదలకు దగ్గర దగ్గర రెండునెలలు గ్యాప్ వస్తోంది. దాన్ని తగ్గించాలని మరో అయిడియా.
మరో పక్క చానెళ్ల పోరు కూడా వుంది. బాహుబలి ఆడియో సభ ప్రసార హక్కులను రికార్డు రేటు అంటే కోటి పాతికలక్షలు ఇచ్చి టీవీ 5 తీసుకుంది. ఇది టీవీ 9, ఎన్టీవీ కి సవాలుగా వుంది. ఇక అవి, బాహుబలికి ఏ మేరకు సహకరిస్తాయన్నది అనుమానం.
మొత్తానికి కేవలం ఫ్యాన్స్ సేఫ్టీ అన్నదే కాదు, ఇంకా చాలా అంశాలు వున్నాయి బాహుబలి ఆడియో ఫంక్షన్ వాయిదా వెనుక అని వినికిడి.
కొసమెరుపు ఏమిటంటే, ఇన్నాళ్లూ పోటీపడుతూ మీడియా అందిస్తున్న రకరకాల బాహుబలి గ్యాసిప్ లు అన్నీ తనకు కామెడీగా అనిపించిందని, అదో కామెడీ ట్రాక్ అని అన్నారు రాజమౌళి. ఇప్పుడు సినిమా విడుదల వాయిదాలు, ఆడియో ఫంక్షన్ వాయిదాలు అలాగే వున్నట్లుంది.