భరత్ అనే నేను సినిమాకు సోమవారం నాడు సెన్సారు పూర్తయింది. శుక్రవారం సినిమా విడుదల. అంటే మధ్యలో నాలుగు రోజులు. సోమవారం సాయంత్రం నుంచే భరత్ అనే నేను సెన్సారు టాక్ అంటూ రకరకాల వదంతులు షికార్లు చేయడం ప్రారంభమైంది. ఇవి రెండు రకరకాలుగా వుండడం విశేషం. సాధారణంగా ఫ్యాన్స్ తమ హీరో సూపర్ అనే ప్రచారం చేసుకుంటారు.
కానీ ఇటీవల పెద్ద సినిమాల విషయంలో ఈ ట్రెండ్ మారింది. వీలయినంతలో ప్రొఫైల్ లో చెప్పడం అన్నది కొత్త ట్రెండ్. అప్పుడు ఈ ప్రచారం కన్నా ఏమాత్రం బాగున్నా అసంతృప్తి అన్నది వుండదు. రంగస్థలం విషయంలో ఈ ట్రెండ్ నే ఇటు యూనిట్ వర్గాలు, అటు అభిమానులు పాటించారు. ఇక రెండో ప్రచారం సినిమా బాగా లేదన్నది. ఇది సాధారణంగా యాంటీ ఫ్యాన్స్ చేస్తారని టాక్.
అయితే భరత్ విషయంలో రెండురకాల టాక్ లు వినిపిస్తున్నాయి. స్పైడర్ విషయంలో మహేష్ ను సోషల్ మీడియాను వాడుకుని దారుణంగా దెబ్బతీసారు. ఓవర్ సీస్ సినిమా పూర్తవగానే వచ్చిన టాక్ ను అత్యంత వేగంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసారు. దీంతో సినిమా అత్యంత వేగంగా కొలాప్స్ అయిపోయింది. కంటెంట్ బాగుంటే ఎవరు ఏమీ చేయలేరు అనడం కరెక్టే. కానీ సినిమాను దెబ్బతీసే రేంజ్ లో సోషల్ నెట్ వర్క్ లో ఊదరగొట్టడం అన్నది కూడా కరెక్ట్ కాదు.
ఇప్పడు భరత్ అనే నేను విషయంలో ఇలా జరగకూడదని మహేష్ అండ్ కో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను బుజ్జగించడానికి ఆయనను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ను బుజ్జగించడానికి అన్నట్లు అతగాడితో పార్టీ చేసుకుని ఫొటోలు దిగారు. సోషల్ నెట్ వర్క్ కోసం ఓ గట్టి టీమ్ ను సెట్ చేసుకున్నారు. అంతా బాగానే వుంది. కానీ మళ్లీ మహేష్ సినిమా టార్గెట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో భరత్ సెన్సారు టాక్ అంటూ కాస్త గట్టిగానే పోస్ట్ లు కనిపిస్తున్నాయి.
ఆ రెండు సినిమాలు
మరోపక్క రామ్ చరణ్ రంగస్థలం ఓ కొత్త రికార్డు సృష్టించింది. నాన్ బాహుబలి రికార్డు తమదే అని ప్రకటించింది. ఈ రికార్డు మరీ పదిరోజుల్లో బ్రేక్ కాకూడదని రామ్ చరణ్ ఫ్యాన్స్ కోరుకోవడం సహజం. కానీ భరత్ అనే నేను బ్రేక్ ఈవెన్ అయింది అంటే, రంగస్థలం రికార్డు పోయినట్లే.
ఇక భరత్ అనే నేను విడుదలైన తరువాత పదిహేను రోజులకు నా పేరు సూర్య విడుదల అవుతోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ దృష్టి కూడా భరత్ మీద వుంటుంది. రంగస్థలం రికార్డు ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ కు ఇరిటేటింగ్ గా వుందన్నది వాస్తవం. బన్నీతో వున్న మెగాభిమానులు పైకి రామ్ చరణ్ విక్టరీని కూడా 'సూపర్.. సూపర్' అంటున్నా, వాళ్లకి కూడా లోపల తమ హీరో కూడా గట్టిగా కొట్టాలని వుంది.
ఇక పవన్ అభిమానులకు, మహేష్ అభిమానులకు పొసగదు అన్నది వాస్తవం. సో, టోటల్ గా మెగాభిమానులు అంతా భరత్ కు అనుకూలంగా వుంటారని అనుకోవడానికి లేదు.
సినిమానే నిలబెట్టాలి
అందువల్ల మారుతున్న ట్రెండ్ లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో భరత్ అనే నేను సినిమాను నిలబెట్టగలగింది సినిమా క్వాలిటీ మాత్రమే. అయితే సినిమా క్వాలిటీ కాస్త అటు ఇటుగా వుంటే మాత్రం, అభిమానులు, సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా వుంటుంది. ఆ విషయంలో భరత్ అనే నేను జాగ్రత్తగా వుండాల్సి వుంది. సినిమా యునానిమస్ హిట్ టాక్ వస్తే హ్యాపీ. అలా కాకుండా ఫరవాలేదు, ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇలాంటి చిన్న చిన్న రిమార్క్ ల టాక్ వస్తే మాత్రం, భరత్ సోషల్ మీడియా వింగ్ కాస్త గట్టిగా కష్టపడి, యాంటీ ప్రచారానికి బ్రేక్ వేయాల్సి వుంది.
ఎందుకంటే ఈసినిమా మహేష్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్. ఈసినిమా సక్సెస్ మీదనే మహేష్ ధైర్య, స్థైర్యం ఆధారపడి వుంటుంది.