భరత్ అనే నేను సినిమా షూట్ ఒక పక్కన జరుగుతోంది. ప్రచారానికి మరో పక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో బిజినెస్ మరో పక్క డిస్కషన్ జరుగుతోంది. చిత్రమేమిటంటే మూడింటినీ దర్శకుడు కొరటాల శివనే కంట్రోల్ చేయడం. సాధారణంగా బిజినెస్ విషయంలో నిర్మాత మాత్రమే కీలకంగా వుంటారు. దర్శకులు పెద్దగా పట్టించుకోరు. కానీ కొరటాల శివ అలా కాదు. బిజినెస్ కూడా ఆయన పర్యవేక్షణలోనే సాగుతుంది.
బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి భయంకరమైన డిజాస్టర్ల తరువాత కూడా మహేష్ సినిమా భరత్ అనే నేను బిజినెస్ కు డిమాండ్ వుందంటే దానికి కారణం కొరటాల శివ ప్రమేయమే. ఆయన తనే గ్యారంటీ అంటూ బయ్యర్లకు ఆఫర్ చేయడం ఒక ఎత్తు, కేవలం తన రెగ్యులర్, తన సర్కిల్ బయ్యర్లకే ఆఫర్ చేయడం మరో ఎత్తు.
దీంతో ఒక్క ఆంధ్రనే 38 నుంచి 40కోట్ల రేషియోలో బిజినెస్ ఫిక్స్ అయింది. నిర్మాత దానయ్య 40కోట్ల రేషియోలో అమ్మాలని చూస్తున్నారు. బయ్యర్లు38కోట్ల రేషియోలో వున్నట్లు తెలుస్తోంది. ఈ రేషియోకి తగ్గితే, అవసరం అయితే తన బయ్యర్లను రంగంలోకి దింపాలని కొరటాల యోచిస్తున్నారు.
వైజాగ్ కు ఈ రేషియోలో కనుక అమౌంట్ రాకపోతే, అక్కడ సినిమాను విడుదల చేయడానికి రెడీగా వుండమని, తన సన్నిహితుడు కృష్ణా, గుంటూరు ప్లేయర్ సుధాకర్ ను కొరటాల కోరినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మొత్తానికి ఒక పక్క సినిమాకు బజ్ రావడానికి వెల్ ప్లాన్డ్ గా సోషల్ నెట్ వర్క్ లో వ్యవహారాలు ప్లాన్ చేస్తూ, మరోపక్క బిజినెస్ కూడా చూడడం అంటే నిర్మాత పంట పండినట్లే.
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న అతి కీలకమైన అసలు గుసగుస ఏమిటంటే, కొరటాల శివ ఇప్పుడు రెమ్యూనిరేషన్ కు సినిమా చేయడం మానేసారని, బిజినెస్ లో పార్టనర్ షిప్ కూడా తీసుకుంటున్నారని, అందుకే భరత్ అనే నేను సినిమా విషయంలో ఆయన అంత కీలకంగా వ్యవహరిస్తున్నారని. బహుశా ఈ గుసగుస నిజమే కావచ్చు.