చెయ్యి ఖాళీ లేదు బాబూ.. రేపు రారాదూ..

ముష్టిలో ఇది వీరముష్టి…! కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను ఎంత చులకనగా చూస్తున్నదనడానికి ఇది నిదర్శనం. వారు నిర్ణయించిన ముహూర్తానికి, వారు పిలిచిన పిలుపును అనుసరించి, రాష్ట్రంనుంచి నలుగురు ప్రతినిధులు వెళ్లి..…

ముష్టిలో ఇది వీరముష్టి…! కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలను ఎంత చులకనగా చూస్తున్నదనడానికి ఇది నిదర్శనం. వారు నిర్ణయించిన ముహూర్తానికి, వారు పిలిచిన పిలుపును అనుసరించి, రాష్ట్రంనుంచి నలుగురు ప్రతినిధులు వెళ్లి.. ఏంటి సంగతో తేల్చమని అడిగితే.. ‘చెయ్యి ఖాళీ లేదు బాబూ రేపు రండి’ అంటూ తిప్పిపంపించారు జైట్లీ! మనది మరీ ముష్టి బతుకు అయిపోతున్నది.

ఈ భేటీ గురించిన వార్తలను బట్టి.. జైట్లీ ఏం చెప్పారో ఓసారి జాగ్రత్తగా గమనించండి..

1) ఫిబ్రవరి 9వ తేదీన తాను రాజ్యసభలో ఏ ప్రకటన అయితే చేశానో దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నా.. అని మాత్రమే జైట్లీ వీరికి చెప్పారట. నిజం చెప్పాలంటే.. ఆరోజు ఆయన రాష్ట్రానికి మేలు జరిగేలా ఏ ఒక్కమాటా చెప్పలేదు గనుకనే.. ఇప్పటిదాకా ఇంత రాద్ధాంతం జరుగుతోంది. ఆరోజు తానేదో తవ్వి తలకెత్తేసినట్టుగా.. ఆ రోజు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా.. అంటూ జైట్లీ.. ఏదో ఒరగబెట్టేసినట్టు మాట్లాడుతున్నారు.

2) ఆయనకు ఏపీ వ్యవహారాలు అంటే ఎంత చులకనగా కనిపిస్తున్నాయనడానికి మరో నిదర్శనం ఉంది. ఆరోజు చెప్పిన అంశాల మీద వివిధ మంత్రిత్వ శాఖల్లో ఇప్పటిదాకా కసరత్తు జరుగుతున్నదట…!!!!!!  అది తేలిన తర్వాత మనకు చెప్తారట. ఆరోజు ఆయన ఏమైనా కొత్త విషయాలను కనుగొని చెప్పారా… విభజన చట్టంలో ఉన్న విషయాలనే కాస్తంత తగ్గించి చెప్పారంతే.

ఇప్పుడు కసరత్తు చేస్తోంటే.. గత నాలుగేళ్లుగా ఆ ప్రభుత్వ శాఖలన్నీ ఏం చేస్తున్నట్టు? పోనీ 9వ తేదీన ఆయన చెప్పారనే అనుకుందాం.. పాతికరోజులు గడుస్తుండగా.. వారింకా తేల్చకుండా ఏం కసరత్తు చేస్తున్నారు.. ఏపీని ఎలా ముంచాలా అని కొత్త రాజ్యాంగం ఏమైనా రాస్తున్నారా? మరి ఇప్పటిదాకా ఏ కసరత్తూ చేయకుండా.. ఏపీ ప్రతినిధుల్ని భేటీకి పంపమని.. అమిత్ షా ఎందుకు అడిగినట్లు..? ఏపీ ప్రతినిధులు అంటే.. మరీ అంత పనికిమాలిన, పనిలేని ముష్టి వాళ్ల లాగా కేంద్రానికి కనిపిస్తున్నారా?

ఏ సంగతీ తేలలేదు.. మళ్లీ సమావేశం కావాల్సి ఉంది.. అన్నంత వరకే సోమవారం నాటి భేటీ గురించి.. మనకు వార్తల్లో కనిపిస్తోంది. కానీ, బిట్వీన్ ది లైన్స్ ఏపీకి జరిగిన చాలా అవమానం కూడా దాగి ఉంది. మరి కేంద్రానికి బుద్ధెలా చెప్పాలో ప్రజలే ఆలోచించుకోవాలి.

-కపిలముని