దాదాపు నాలుగైదు నెలల నుంచి భారీ హిట్ సినిమా కోసం ఎదురు చూసున్నారు సినిమా జనాలు. అజ్ఞాతవాసి ఆ కోరిక తీరుస్తుంది అనుకుంటే నిరాశపరచింది. ఆ తరువాత మళ్లీ ఎదురు చూడగా చూడగా రంగస్థలం వచ్చింది. రంగస్థలం వచ్చిన మూడు వారాలకు మహేష్ బాబు 'భరత్ అనే నేను' రాబోతోంది.
రంగస్థలం వ్యవహారం చూస్తుంటే నాన్ బాహుబలి రికార్డులు సృష్టించేలా వుందన్నది కన్ ఫర్మ్ అయిపోయింది. పైగా జనాలు సినిమాలు చూసే దృష్టి మారుతోందని రంగస్థలం కాస్త చెప్పకనే చెప్పింది. ఇలాంటి నేపథ్యంలో ఈ మార్పు, ఈ విజయం భరత్ అనే నేను సినిమా మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తాయన్నది ప్రశ్న.
ఒక విధంగా రంగస్థలం విజయం భరత్ అనే నేనుకు ప్లస్ అవుతుంది. స్పైడర్, అజ్ఞాతవాసి సినిమాలు కొట్టిన దెబ్బకు బయ్యర్ల కళ్లు పచ్చబడ్డాయి. సినిమా కొనడం అంటే షాక్ కొట్టినట్లు భయపడే పరిస్థితి వచ్చింది. రంగస్థలం సినిమా బిజినెస్ మీద కూడా ఆ ప్రభావం కనిపించింది. బయ్యర్ల దగ్గర, ఎగ్జిబిటర్ల దగ్గర డబ్బులు కరువయ్యే పరిస్డితి. ఓవర్ సీస్ లో కూడా ఇదే పరిస్థితి.
ఇప్పుడు రంగస్థలం సక్సెస్ తో కాసులు కాస్త గలగలలాడడం సంగతి అలా వుంచితే, పోయిన ధైర్యం కాస్త తిరిగి వస్తోంది. అందువల్ల సినిమా విడుదల ముందు థియేటర్ల అడ్వాన్స్ లు, హైర్ లు, పేమెంట్లతో పెద్దగా సమస్య రాదు. అలాగే డిఫరెంట్ సినిమా చూడడం అన్నది రుచి చూసిన జనం భరత్ ఏమాత్రం డిఫరెంట్ గా బాగున్నా, నెత్తిన పెట్టుకుంటారు. ఇదంతా పాజిటివ్ సైడ్.
ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ వుంది. ఓ సినిమా ఏదైనా ట్రెండ్ సెట్ చేసి, బ్లాక్ బస్టర్ అయితే ఆ వెంటనే వచ్చే పెద్ద సినిమాలు ఏవీ అంత సులువుగా ప్రేక్షకులకు సంతృప్తి కలిగించవు. కంపారిజన్ వస్తుంది. అంతకు మించి అన్నట్లుగా, హిట్ అయిన సినిమాను మించి సంతృప్తి కలిగించాల్సిన బాధ్యత తరువాతి సినిమా మీద వుంటుంది. ఆ విదంగా కొరటాల శివ మీద ఇప్పుడు కాస్త గట్టి బాధ్యతే వుంది. అయితే కొరటాల శివ నెరేషన్, ఎమోషన్, అన్నీ బాగుంటాయి కాబట్టి అధైర్య పడాల్సింది ఏమీ లేదు.
భరత్ అనే నేను సినిమాకు కాస్త దూరంగా వస్తోంది అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' ఈ సినిమా మీద కూడా రంగస్థలం ప్రభావం అంతో ఇంతో వుంటుంది. ట్రాష్ అని కొట్టి పారేయడానికి లేదు. పైగా బన్నీ- రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య కనిపించని వైరం వుండనే వుంది. దాని ఫ్రభావం కూడా వుంటుంది.
మొత్తం మీద రంగస్థలం సినిమా నిర్మాతకు డబ్బులు తెచ్చి పెట్టడమే కాదు, మిగిలిన నిర్మాతలకు టెన్షన్ కూడా తెచ్చింది.