ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది చిన్న, మీడియం డైరక్టర్లకు, దర్శకుడు మారుతి చూపించిన రూట్ ఆదర్ళంగా మారుతోంది. చిన్న సినిమాలు చేయడం, ఓ సినిమా డైరక్ట్ చేస్తూ, మరో సినిమాకు కథ అందించడం, లేదా మరో సినిమాకు నిర్మాణ భాగస్వామ్యం వహించడం ఇలా రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఈ బాటలో మరో డైరక్టర్ చేరినట్లు కనిపిస్తోంది. ఆ డైరక్టర్ ఎవరో కాదు. ఇప్పటికే రెండు మీడియం హిట్ లు కొట్టిన నక్కిన త్రినాధరావు.
ఈయన ప్రస్తుతం రామ్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈలోగా మధ్యలో మరో సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారట. గతంలో భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ సినిమాలో హీరోగా చేసిన చరణ్ తేజ్ ఇప్పుడు స్వంతంగా ఓ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. పైగా ఆ సినిమాకు దర్శకుడు కూడా అతగాడే.
అయితే పేరుకు దర్శకత్వ పర్యవేక్షణ అనే కానీ, టోటల్ గా సినిమా అంతా నక్కిన త్రినాధరావే చేసారని టాక్. అయితే ఓ పక్క దిల్ రాజు బ్యానర్, రామ్ హీరోగా సినిమా. అలాంటి టైమ్ లో ఇలాంటి సినిమాకు డైరక్టర్ గా పేరు వేసుకోవడం కాస్త ఇబ్బందే కావచ్చు. అందుకే హీరోకే డైరక్షన్ క్రెడిట్ ఇచ్చేసి, ఆయన దర్శకత్వ పర్యవేక్షణ కార్డ్ వేసుకున్నారని టాక్.
గతంలో ఇలాంటివి మారుతి చాలా చేసారు. ఆయనే ఆదర్శం కావచ్చు. అన్నట్లు ఈ సినిమా వెనుక మారుతి చేయి కూడా వుంది. నిర్మాణ పర్యవేక్షణో, మరోటో మొత్తానికి. ఇద్దరు డైరక్టర్లు కలిపి ఓ కుర్ర హీరో కమ్ డైరక్టర్ కు సాయం చేస్తున్నారన్నమాట.