అజ్ఞాతవాసి ఇబ్బంది భరత్ అనే నేను సినిమా మీదకు వచ్చింది. హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణ పొందో లేదా అనుసరించో మొత్తానికి ఏదో ఒకటి చేసి అజ్ఞాతవాసి కథ అల్లుకున్నారు. అది నానా రచ్చ అయింది. ఇంకా అవుతోంది కూడా.
అజ్ఞాతవాసి ప్రేరణ పొందిన హాలీవుడ్ సినిమా నుంచే భరత్ అనే నేను సినిమా కథ కూడా తయారైందన్న గుసగుసలు వున్నాయి. పవన్ అజ్ఞాతవాసి వ్యాపార వారసుడి కథ, మహేష్ భరత్ అనే నేను రాజకీయ వారసుడి కథ.
అయితే అజ్ఞాతవాసి రగడ స్టార్ట్ అయిన వెంటనే భరత్ అనే నేను సినిమా జనాలు పూర్తిగా అలర్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అప్పటికప్పుడు కథలో చిన్న చిన్న మార్పులు చేసినట్లు వినిపిస్తోంది.
సినిమాకు వేరే విధమైన రిపేర్లు, మార్పులు కూడా చేపట్టాల్సి రావడంతోనే సంక్రాంతికి విడుదల అనుకున్న సినిమా మార్చి మూడో వారం వరకు షూటింగ్ షెడ్యూలు వరకు వచ్చిందని తెలుస్తోంది.
ఇలా మార్పులు చేర్పులు చేసిన తరుణంలో చెన్నయ్ నుంచి హుటాహుటిన ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ను కూడా ఇక్కడకు రప్పించారని వినికిడి. కొరటాల, శ్రీకరప్రసాద్ డిస్కషన్ల సాగించిన అనంతరం మార్పులు చేర్పులు ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అజ్ఞాతవాసి తరువాత భారీ రేట్లకు విక్రయిస్తున్న సినిమా భరత్ అనే నేను. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో దెబ్బతిని వున్నారు ఇటు బయ్యర్లు, అటు మహేష్ బాబు కూడా. అందువల్ల భరత్ అనే నేను సినిమా చాలా కీలకం. మరి ఈ మార్పులుచేర్పుల తరువాత ఎలా వస్తుందో? అందరి నమ్మకం కొరటాల శివ మీదనే.