భవ్య ఆనంద్ ప్రసాద్ విజయవంతమైన వ్యాపారవేత్త. కానీ అది సిమెంట్ ఫ్యాక్టరీ, రియల్ ఎస్టేట్ వరకే. సినిమాలకు వచ్చేసరికి పెద్దగా హిట్ లు లేవు. చాలా సినిమాలు అపజయాలే చవిచూసాయి. ఇప్పుడు లేటెస్ట్ గా రాజకీయాల్లోకి వచ్చారు. మరి తమ సామాజికవర్గ ఓట్ల పుష్కలంగా వున్న శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకుని, బాలయ్య అండతో టికెట్ తెచ్చుకున్నారు. అంతవరకు బాగానే వుంది.
కానీ ఇక్కడ వ్యవహారం మాత్రం అంత నల్లేరు మీద నడకలా లేదని వార్తలు వినవస్తున్నాయి. ఇప్పటిదాకా బయటకు వస్తున్న సర్వేలు అన్నీ శేరిలింగంపల్లిని తీసుకెళ్లి టీఆర్ఎస్ ఖాతాలో పడేస్తున్నాయి. అదెందువల్లనో తెలియదు. ప్రతినోటా శేరిలింగంపల్లి దేశం గెలుపు అంత సులువు కాదని వినిపిస్తోంది.
కూకట్ పల్లి మిగిలిన నియోజకవర్గాలు దేశం విజయం పక్కా అంటూ శేరిలింగంపల్లిని మాత్రం ఎందుకు పక్కన పెడుతున్నారో? అన్నది గ్రౌండ్ లెవెల్ కు వెళ్తే కానీ అర్థంకాదేమో? అప్పటికీ ఇక్కడ రెబల్ గా నామినేషన్ వేసిన బిక్షుపతి యాదవ్ ను బామాలి, బతిమాలి, ఉపసంహరింపచేసి, ఆనంద్ ప్రసాద్ వైపు తీసుకువచ్చారు. అయినా టాక్ మాత్రం డిఫరెంట్ గానే వినిపిస్తోంది.
ఇటు టీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ అటు భవ్య ఆనంద్ ప్రసాద్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.అయితే కమ్మ సామాజిక వర్గ ఓట్లు టీడీపీకే అయితే కనుక భవ్య ఆనంద్ ప్రసాద్ కు పెద్దగా సమస్య రాదు. అలా కాకపోతేనే సమస్య అంతా. పైగా ఈ నియోజకవర్గంలో ఖర్చు కూడా జోరుగా వుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక అభ్యర్థికి రోజుకు యాభైలక్షల వరకు ఖర్చు అవుతోందని వినిపిస్తోంది. జనాల సమీకరణకు రోజుకు రెండువేలు, క్వార్టర్ మందు ఇస్తేతప్ప పనిజరగడం లేదని టాక్. ఈ లెక్కన శేరిలింగంపల్లి ఎన్నికకు భవ్య ఆనంద్ ప్రసాద్ దగ్గర దగ్గర ఇరవై నుంచి ముఫైకోట్లు ఖర్చుచేయాల్సి వుంటుంది.
భవ్య ఆనంద్ ప్రసాద్ కు రాజకీయంగా అదృష్టం కలిసి రావాల్సి వుంది. మహాకూటవి ఊపు, స్వీపు వస్తే అదృష్టం కలిసి వస్తుందేమో? చూడాలి.
ఎన్టీఆర్ కు భవిష్యత్ లేకుండా చేసే ప్లాన్… చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్