బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ ఎంత ఉంటుంది? అంత తేలికగా సమాధానం దొరికే ప్రశ్నకాదు ఇది. అయితే అనుకోకుండా దీనికి సమాధానం దొరికింది. బిగ్ బి భార్య, నటి జయా బచ్చన్ రాజ్యసభ సభ్యురాలిగా దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్ లో తమ కుటుంబ ఆస్తుల విలువను ఆమె పేర్కొంది.
ఇందులో కొడుకు, కోడలు, ఇతర సంతానం పేర్ల మీద ఉన్న ఆస్తులను పేర్కొనలేదు కానీ.. తన పేరిట, తన భర్త పేరిట ఉన్న ఆస్తుల విలువను మాత్రం జయబచ్చన్ పేర్కొన్నారు.
దాని ప్రకారం.. ఈ దంపతుల మొత్తం ఆస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలు! వీరి ఆస్తుల, పెట్టుబడుల విలువ ఈ స్థాయిలో ఉంది. వీటిలో అమితాబ్ పేరిట ఉన్న ఆస్తుల విలువ ఎనిమిది వందల కోట్లు కాగా.. జయబచ్చన్ పేరిట దాదాపు రెండు వందల కోట్ల ఆస్తులున్నాయి.
స్థూలంగా వెయ్యి కోట్ల రూపాయల మొత్తం వీరి ఆస్తిగా తెలుస్తోంది. విశేషం ఏమిటంటే.. ఒక దశలో అమితాబ్ బచ్చన్ ఆస్తులన్నీ కరిగిపోయిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఏబీసీఎల్ తో అమితాబ్ తీవ్రంగా నష్టపోయడనే విషయంపై బాగా ప్రచారం జరిగింది. దాన్ని బిగ్ బి కూడా ధ్రువీకరించాడు.
అయితే తిరిగి కౌన్ బనేగా కరోడ్ పతి వంటి షో దగ్గర నుంచి అమితాబ్ దశ మళ్లీ తిరిగింది. సినిమాలు కూడా హిట్ కావడం. క్యారెక్టర్ ఆర్టిస్టు తరహా వేషాలతో బిజీ అయిపోవడం. మరోవైపు ఎండార్స్ మెంట్స్.. ఇలా బీభత్సంగా సంపాదించసాగాడు బిగ్ బి. ఈ నేపథ్యంలో ఆయన అప్పులన్నీ తీరిపోయి.. ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల రూపాయల స్థాయి సంపాదన పరుడైనట్టుగా ఉన్నాడు!