కెరియర్ పీక్ లో వున్నపుడు పెద్ద హీరోలు జాగ్రత్తగా స్టెప్ వేయాలి లేదంటే వ్యవహారం మారిపోతుంది. మాస్ కమర్షియల్ సినిమాలు తనకు అచ్చిరావడం లేదని గమనించి, ట్రాక్ మార్చి, కోరి కోరి ధృవ, రంగస్థలం చేసాడు రామ్ చరణ్. రంగస్థలం సినిమాను ఎంత ఇష్టపడ్డాడంటే ప్రభాస్ బాహుబలిని ఇష్టపడినంత.
దాదాపు ఏడాదిన్నరకు పైగా గెడ్డంతో వుండడం, ఒకే గెటప్ తో వుండడం, ఒకే సినిమా మీద వుండడం అంటే ఎంత కష్టమో ప్రభాస్ ను అడిగితే చెబుతాడు. ఎప్పుడూ నిడివి అంటే పదునైన కత్తెర పట్టుకుని వుంటే మెగాస్టార్ చిరంజీవి కూడా కొడుకు రామ్ చరణ్ మాటకు తలొగ్గి, ఊరుకున్నాడు. మూడు గంటల సినిమా తెరమీదకు వచ్చింది. ఇలా అన్ని విదాలా ఆలోచించుకోవాలి హీరోలు.
కానీ, ప్రభాస్ ఏం చేసాడు. బాహుబలి లాంటి భారీ హిట్ తరువాత చక్కగా మంచి డైరక్టర్లతో ఆరేసి నెలలకు ఓ సినిమా చేసి చూపించడం మానేసి, మళ్లీ సాహో అంటే జేమ్స్ బాండ్ సినిమా తలకెత్తుకున్నాడు. అసలు తెలుగు జేమ్స్ బాండ్ సినిమాలను మన జనాలు పెద్దగా నచ్చిన దాఖలాలు తక్కువ. పోనీ టెక్నికల్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్ లో వుంటే ఆదరిస్తారేమో? అని అనుకుందామన్నా, బాహుబలి తరువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకోవడం ఏమిటి?
ఇక ఎన్టీఆర్. మాంచి ఊపు మీద వున్నాడు. త్రివిక్రమ్ సినిమా తరువాత అవసరం అయితే కొరటాల, సుకుమార్ రెడీగా వుంటారు. ఇలాంటి టైమ్ లో మళ్లీ ఏడాదికి పైగా టైమ్ పట్టే సినిమా ఒకె చేసాడు. రాజమౌళి సినిమా ఎంతో గొప్పగా వుండొచ్చు. అయినా 2018త్రివిక్రమ్ సినిమా తరువాత 2020వరకు సినిమా వుండదంటే కష్టమే.
రామ్ చరణ్ కూడా డిటో డిటోనే. బోయపాటి సినిమా ఈ ఏడాది వచ్చేస్తుంది. ఆ తరువాత మళ్లీ రాజమౌళి సినిమా అంటే 2020. ఏ హీరో అభిమానులైనా తమ హీరోలు చకచకా సినిమాలు చేయాలని, తరచు ఓ సినిమా అందివ్వాలని కోరుకుంటారు. రెండేళ్లకో సినిమా అంటే వాళ్లకు కాస్త నిరాశగా వుంటుంది.
ఇక పవన్ కళ్యాణ్ ది డెస్టినీ. నిజానికి ఆయన అజ్ఞాతవాసి తరువాత మరో సినిమా చేద్దామనే అనుకున్నారు. అలా మరో సినిమా చేసి, వీలైతే ఇంకోటి చేద్దామని కూడా ప్లాన్ చేసారు. కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లు ఇచ్చిన నిరాశను అజ్ఞాతవాసి తీసి పారేస్తుందని అనుకున్నాడు. అసలు పవన్ సినిమా ప్లాన్ లనే కాదు, పొలిటికల్ ప్లాన్ లను కూడా అజ్ఞాతవాసి సమూలంగా మార్చేసింది.
ఇలా నలుగురు పెద్ద హీరోలు లాంగ్ లీవ్ పెట్టేసినట్లయింది. ఇక మిగిలింది మహేష్, బన్నీలే. బన్నీ కూడా ఈ జూలై తరువాత కానీ సినిమా స్టార్ట్ చేసే అవకాశం లేదు. అంటే మళ్లీ సమ్మర్ రావాల్సిందే సినిమా రెడీ కావాలంటే.
తమ రెమ్యూనిరేషన్ నే 20కోట్లకు చేరడం, తము ఎంచుకున్న దర్శకులు కూడా 15నుంచి 20కోట్లు తీసుకోవడంతో, అనివార్యంగా సినిమాలు 100కోట్ల సినిమాలు అవుతున్నాయి. ఎప్పుడయితే వందకోట్ల సినిమాలు అయ్యాయో, అంతకు అంతా టైమ్ తీసుకుని చెక్కాల్సి వస్తోంది. కానీ ఇప్పుడు వందకోట్లు మన హీరోలకు, డైరక్టర్లకు సంతృప్తినివ్వడం లేదు. అందుకే అందరూ 200కోట్ల సినిమాల మీదకు దృష్టి సారిస్తున్నారు. అంతే కానీ అభిమానుల అభిమతం చూడడం లేదు.