ఎన్టీఆర్ బయోపిక్ నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నాడన్న వార్త బయటకు రాగానే సినిమా యూనిట్ ఉలిక్కిపడింది. నిజానికి ఈ విషయం వారం రోజుల బట్టి నలుగుతోంది. ఈ నలుగుడు ఇలా వుండగానే డైరక్టర్ క్రిష్ కొసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరోపక్క్ ఇద్దరు నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటి మాత్రం దర్శకుడు తేజను బుజ్జగించే ప్రయత్నం చేసారని తెలుస్తోంది. కానీ తేజ వినలేదు.
బయోపిక్ కు చేస్తున్న ప్లానింగ్ కరెక్ట్ కాదని, బయోపిక్ తీయాల్సిన పద్దతి ఇది కాదనీ ఆయన చెప్పేసి, తప్పుకున్నారు. కానీ నిర్మాతలు ఈ వార్తను బయటకు రానివ్విలేదు. అయితే ఆ వెంటనే ఇండస్ట్రీలో చిన్న గుసగుసలు అయితే వినిపించడం ప్రారంభమయ్యాయి. ఆఖరికి అనుకోకుండా బయటకు వచ్చేసింది.
బయటకు వచ్చిన దగ్గర నుంచి నిర్మాతలు కిందా మీదా అయినట్లు బోగట్టా. దర్శకుడు తేజనే లీక్ చేసి వుంటారని నిర్మాతల భావనగా తెలుస్తోంది. కానీ చిత్రంగా ముందుగా లీక్ చేసింది మాత్రం దర్శకుడు తేజకాదు. బయటకు వచ్చిన తరువాత మీడియా జనాలు అడిగితే అవునని మాత్రమే ఆయన చెప్పింది. ఎప్పుడయితే ఇలా బయటకు వచ్చిందో, నిర్మాతలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుస ఏమిటంటే, బాలయ్య డైరక్టర్ అయితే బయోపిక్ కు న్యాయం జరగకపోవచ్చని. ఎందుకంటే బయోపిక్ కు ఎంతో రీసెర్చ్, ఓపిక, నేర్పు, సహనం కావాలి. ఎన్టీఆర్ సినిమా కేవలం బయోపిక్ మాత్రమే కాదు, పీరియాడిక్ సినిమా కూడా. మహానటికి చేసినట్లు ఎంతో రీసెర్చ్ అవసరం.
అవేమీ చేయకుండా, చకచకా కానిచ్చేద్దాం, మూడు నెలల్లో చుట్టేద్దాం అనుకుంటే కష్టం. పైగా ఎన్టీఆర్ యంగ్ ఏజ్ సీన్లతో సమస్య వుంది. బాలయ్య యంగ్ ఏజ్ క్యారెక్టర్ కు మరొక నటుడిని ఎవర్నీ పెట్టలేరు. అలా అని బాలయ్య చేస్తే అంత బాగుండదు. ఇలా ఒకటి కాదు సవాలక్ష సమస్యలు వున్నాయి.
ఇవన్నీ కలిసి సాయి కొర్రపాటి మీద పడేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు విష్ణు ఒక నిర్మాత, సాయి కొర్రపాటి మరో నిర్మాత. బాలయ్య దూకేయ్ అంటే దూకేసే రకం సాయి కొర్రపాటి. అందువల్ల సినిమా భారం మొత్తం ఆయనపై పడిపోయినా ఆశ్చర్యం లేదు. అసలే ఆర్థికంగా దెబ్బలు తిని వున్నారు. ఇప్పుడు బయోపిక్ భారం కూడా ఆయనే మోయాలి అంటే కాస్త కష్టమే.
ఇలాంటి నేపథ్యంలో రాఘవేంద్రరావు ఇచ్చారని వినిపిస్తున్న సలహా యే కరెక్ట్ యేమో? ఈ ప్రాజెక్టును బాలయ్య అలా వుంచేయడమే బెటరేమో? లేదా, రెండేళ్లు సమయం ఇచ్చి, క్రిష్ లాంటి వాళ్లకు అప్పగించాలి. అంతే కానీ దుందుడుకుగా ఏం చేసినా, అది ఎన్టీఆర్ పేరును పాడుచేసే ప్రమాదం వుంది.