తెలుగు నటులు తెలుగు మాట్లాడానికి తెగ ఇదయిపోతున్నారు. ఒకరిద్దరు కథానాయికలు తెలుగు భాష రాకపోయినా, తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుండడం కొంతలో కొంత సంతోషకరమైన విషయం. తెలుగుని ‘టెల్గు’గా నటీనటులు ఖూనీ చేసేస్తోంటే, ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ మాత్రం ఎంచక్కా తెలుగులో మాట్లాడేస్తున్నాడు.
అతనెవరో కాదు, జానీ లీవర్. తెలుగు ప్రేక్షకులకు జానీ లీవర్ పెద్దగా తెలియకపోయినా, బాలీవుడ్ ప్రేక్షకులకు అతను సుపరిచితుడు. బాలీవుడ్‌లో సీనియర్ మోస్ట్ కమెడియన్ అయిన జానీ లీవర్, టాలీవుడ్‌లో టాప్ కమెడియన్ అయిన బ్రహ్మానందం కోసం హైద్రాబాద్ వచ్చాడు. బ్రహ్మీ తనయుడు గౌతమ్ హీరోగా నటించిన ‘బసంతి’ సినిమా ఆడియో విడుదల వేడుకలో జానీ లీవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఏదో వచ్చి, నాలుగు మాటలు మాట్లాడి ఊరుకోకుండా, మంచి కామెడీ స్కిట్స్ కూడా చేశాడు జానీ లీవర్. అవి కూడా తెలుగులోనే కావడం గమనార్హం. టెక్నాలజీ మనిషి జీవితంలో భాగమైపోవడం, వాటికి మనిషి ఎడిక్ట్ అయిపోవడం వంటివి తన కామెడీ స్కిట్స్‌లో చేసి, నవ్వించడమే కాక, ఆలోచింపజేశాడు జానీ లీవర్.
ప్రకాశం జిల్లాలో జన్మించిన జాన్ ప్రకాష్‌రావు జనుముల, బాలీవుడ్‌లో జానీ లీవర్ అయ్యాడు. హిందూస్తాన్ లీవర్ కంపెనీలో ఒకప్పుడు పనిచేయడంతో ఆయన పేరు లో ‘లీవర్’ చేరింది.