2014 ఎన్నికలలో యుపిఏ ఘోరంగా ఓడిపోతుందని, ఎన్‌డిఏ నెగ్గుతుందని, ప్రధాని అయ్యే అవకాశాలు మోదీకి మెండుగా వున్నాయనీ అందరూ అనుకుంటున్నారు. కార్పోరేట్ రంగం మరీ గట్టిగా అనుకుంటోంది. మోదీకి విమర్శలు సహించే అలవాటు లేదు కాబట్టి, తను ప్రధాని కావడానికి వ్యతిరేకించిన లేదా సహకరించని ప్రచురణాసంస్థల పని బడతాడని భయపడుతోంది కూడా. అందువలన పత్రికలు, టీవీలు నడిపే కార్పోరేట్లు మోదీకి వ్యతిరేకంగా రాయడానికి యిచ్చగించడం లేదు. తమ సంపాదకవర్గంలో ఎవరైనా మోదీని విమర్శిస్తే వాళ్లను సాగనంపడానికి కూడా వెనుకాడటం లేదు. 'వ్యక్తి ఆరాధనలో యిలాటి విపరీతపోకడలు నియంతృత్వానికి దారి తీస్తాయి. ఒకటి రెండు ఉదాహరణలు చూసి యిలా తీర్మానించడం తప్పు. పరిస్థితి మరీ అంత దారుణంగా వుండివుండదు' అని అనుకునే పాఠకులు కొందరి గురించి తెలుసుకోవాలి.
సన్ టీవీలో 17 సంవత్సరాలుగా ఒక టాక్ షో నిర్వహిస్తున్న తిరు వీరపాండ్యన్ ముజఫర్‌నగర్ అల్లర్లపై నవంబరు 25 న ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ''మోదీకి ఓటేసేముందు ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ నిర్ణయపు ప్రభావం రాబోయే 15 ఏళ్లపాటు వుంటుంది.'' అన్నాడు. అతని వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. అది చూసి తమిళనాడు బిజెపి యూనిట్ సెక్రటరీ సర్వోత్తమన్ సన్ టివి యాజమాన్యానికి డిసెంబరులో ఫిర్యాదు చేశాడు. 'ప్రజలను మతం పేర చీలుస్తున్న యిలాటి వ్యాఖ్యలు చేసిన వీరపాండ్యన్ కార్యక్రమాల్లో మా పార్టీవారు ఎవరూ పాల్గొనరు'' అని వారు రాసి యిచ్చారు. అంతే, సన్ టివి వారు డిసెంబరు 20 నుండి అతని కార్యక్రమాన్ని రద్దు చేశారు. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ముస్లిములు ఎందరు నిరసన తెలిపినా అతన్ని సన్ టివి మళ్లీ పిలవలేదు.
''ద హిందూ'' పత్రికకు ఎడిటరుగా పని చేసే సిద్దార్థ వరదరాజన్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఏ రాజకీయనాయకుడికి వార్తల్లో ఎంత ప్రాముఖ్యత యివ్వాలి, అతని కార్యకలాపాలకు ఎంత కవరేజి యివ్వాలి అన్న విషయంపై ఒక చార్ట్, కొన్ని నియమాలు తయారుచేశాడు. దానిలో మోదీకి పెద్దగా చోటు కల్పించలేదు. అంతే ''హిందూ'' యాజమాన్యం అతన్ని అక్టోబరులో ఉద్యోగం నుండి తొలగించింది. 'అదేమిటి?' అంటే ఎడిటర్ ఇన్ చీఫ్‌గా వున్న ఎన్. రవి ''మా పత్రిక సిద్ధాంతపరంగా మోదీని వ్యతిరేకిస్తుంది. మేం అతన్ని విమర్శిస్తూ సంపాదకీయాలు రాస్తాం. కానీ అతను ప్రస్తుతం వార్తల్లో వ్యక్తి. మన వ్యక్తిగత యిష్టాయిష్టాల బట్టి అతనికి తక్కువ కవరేజి యిస్తాననడం తప్పు. మోదీ జాతీయస్థాయిలో ఎదుగుతున్న విషయానికి వరదరాజన్ సరైన ప్రాధాన్యత యివ్వలేదు. అందుకే తీసేశాం.''అన్నాడు. వరదరాజన్‌ను అడిగితే ''మామూలుగానే పెట్టుబడిదారుడికి రిస్కు తీసుకోవడం యిష్టం వుండదు. మోదీ స్వభావం తెలిసిన కార్పోరేట్లు అతనికి కోపం తెప్పించడానికి వణుకుతాయి. మా పత్రిక కూడా మినహాయింపు కాదు.'' అన్నాడు.
సోషల్ మీడియాలో మోదీ సమర్థకులు కుప్పలుతిప్పలుగా వున్నారు. వారు మోదీ మాటలను వ్యాప్తి చేస్తూ వుంటారు. అతనికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా రాస్తే విరుచుకు పడి, రాసినవాణ్ని చావతిడతారు. అవి చూపించి, పత్రికాధిపతులు తమ సంపాదకులను అదుపు చేయడానికి, అవసరమైతే వదుల్చుకోవడానికీ ప్రయత్నిస్తున్నారు. అక్టోబరులో ''దివ్యభాస్కర్'' అనే హిందీ దినపత్రిక మోదీ చెప్పాడంటూ హెడ్‌లైన్సుగా ఒక వార్త వేసింది. 'పటేల్ అంటే నెహ్రూకు ఎంత వ్యతిరేకత అంటే ఆయన అంత్యక్రియలకు నెహ్రూ హాజరు కాలేదు.' అని. అది వెంటనే సోషల్ మీడియా అంతా చక్కర్లు కొట్టింది. అందరూ నెహ్రూను తిట్టనారంభించారు. నిజానికి నెహ్రూ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ విషయాన్ని టివి ఛానెల్ వాళ్లు చర్చించి, పత్రికను తిట్టిపోశారు. రెండు రోజులు పోయాక, ఆ పత్రిక ఆ వార్తను సవరించుకుంది. వివరణలు యిచ్చుకోలేదు. ఈ తప్పుడు వార్త ప్రచురించినందుకు సంపాదకవర్గంపై చర్య తీసుకోలేదు. ఎందుకంటే అది మోదీకి వ్యతిరేకమైనది కాదు! ట్విట్టర్ సంస్థలో న్యూస్ హెడ్‌గా వున్న రషీల్ ఖుర్షీద్ కథ వేరేలా నడిచింది. అతను గతంలో మోదీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను మోదీ అభిమానులు తవ్వి తీసి వాటిని ఖండిస్తూ 5 వేల సంతకాలు సేకరించి ట్విట్టర్ సంస్థకు పంపారు. అంతే ట్విట్టర్ అతని ఉద్యోగానికి స్వస్తి చెప్పింది.
''ఓపెన్'' అనే పత్రికకు పొలిటికల్ ఎడిటర్‌గా పని చేసిన హరీష్ సింగ్ బాల్ తన రచనల్లో రాహుల్ గాంధీని, మోదీని యిద్దర్నీ విమర్శించేవాడు. ఈ మధ్య తన పత్రిక కవర్‌పై ఒక బొమ్మ వేశాడు. గోధ్రా అల్లర్లను గుర్తు చేసేలా కపాలాల గుట్టపై కూర్చున్నట్టు మోదీ ఫోటో, వారసత్వరాజకీయాలను గుర్తు చేసేట్లా తలిదండ్రుల భుజంపై కూర్చున్న రాహుల్ ఫోటో కలిపి వేశాడు. అది సోషల్ మీడియాలోకి వెళ్లిపోయి వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా అదే కనబడడంతో మోదీ అభిమానులు ఫిర్యాదు చేశారు. పత్రిక యాజమాన్యం ఆ ఫోటోను తీసేయమంది. పైగా ఏ వివరణా యివ్వకుండా ఎడిటరుగా వున్న హరీష్‌ను తీసేశారు. నెట్‌వర్క్18 అనే మీడియా గ్రూపుంది. ''ఫోర్బ్‌స్'' అనే మ్యాగజైన్ ఆ గ్రూపుదే. ముకేశ్ అంబానీ ఆ గ్రూపు కొనేయడంతో సంపాదకులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. మోదీపై విమర్శలు ఘాటుగా వుండకూడదని కొత్త యాజమాన్యం స్పష్టంగా చెప్పడంతో దాని ఎడిటర్లు నలుగురు తప్పుకున్నారు. వారిలో ఇంద్రజిత్ గుప్తా ఒకరు. ఆ గ్రూపు నడిపే టీవీ ఛానెళ్లు, పత్రికలు, ఆన్‌లైన్ మ్యాగజైన్ .. అన్నిటికీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు – మోదీని ప్రమోట్ చేయాలని!
మీడియాను నడిపే వ్యాపారస్తులందరూ బిజెపి సమర్థకులు కానక్కరలేదు. కానీ వారికి యాడ్స్‌పై వచ్చే ఆదాయం ముఖ్యం. గుజరాత్ ప్రభుత్వం ప్రకటనలపై విచ్చలవిడిగా ఖర్చుపెడుతోంది. పటేల్ విగ్రహం పేరు చెప్పి, రిపబ్లిక్ డే రన్ పేరు చెప్పి, ఓటర్సు డే అని- సందర్భం వున్నా లేకపోయినా తరచుగా మోదీ బొమ్మతో దేశంలోని అన్ని భాషల పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ గుప్పిస్తోంది. టీవీల్లో స్లాట్స్ కొంటోంది. గుజరాత్ ప్రజలపై యీ భారం పడవచ్చు కానీ మీడియాకు ఆదాయమే ఆదాయం. అందువలన అన్ని మీడియా సంస్థలు తమ ఎడ్వర్టయిజ్‌మెంట్ సిబ్బందిని అహ్మదాబాద్ తోలుతున్నారు. యాడ్స్ తీసుకుని కూడా మోదీకి వ్యతిరేకంగా వార్తలు వేసే మీడియాకు శిక్ష తప్పటం లేదు. ఇటీవల ఒక బిజినెస్ మ్యాగజైన్ వారు 'వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్'పై కవర్ స్టోరీ చేస్తామంటే గుజరాత్ అధికారులు అక్కరలేదు పొమ్మన్నారు. మోదీ గురించి బాగా రాస్తే గుజరాత్ ప్రభుత్వం ఖర్చుపై యాడ్స్ వస్తాయి, తిడుతూ రాస్తే సోషల్ మీడియానుండి తిట్లు, చివాట్లు, రాజకీయపరమైన ఒత్తిళ్లు. అందువలన మీడియా యజమానులు తమ సంపాదకవర్గం మెడలు వంచుతున్నారు, వంచనంటే నరుకుతున్నారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)