రోబోకు సీక్వెల్ గా వస్తున్న 2.0 అనేది కేవలం సౌతిండియా ప్రాజెక్టు మాత్రమే కాదు. పలు భాషల్లో విడుదలవుతున్న జాతీయ ప్రాజెక్టు ఇది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న సినిమా. ఏకంగా 543 కోట్ల రూపాయల అతి భారీ బడ్జెట్ సినిమా. ఇలాంటి సినిమా నుంచి వచ్చిన టీజర్ బాలీవుడ్ జనాల్ని పూర్తిగా నిరాశపరిచింది.
అవును.. 2.0 టీజర్ లో అక్షయ్ కుమార్ కనిపించ లేదు. ఏదో ఒక చోట ఇలా వచ్చి అలా మాయమౌతాడు. ఇది సౌత్ జనాలకు అస్సలు పట్టింపులేని అంశం. కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. భారీ మార్కెట్, కోట్లాది అభిమానులు కలిగిన అక్షయ్ కుమార్ ను టీజర్ లో కాస్త ఎక్కువగా చూపించకపోవడంపై బాలీవుడ్ మీడియాతో పాటు ప్రేక్షకులు కూడా కోపం వ్యక్తంచేస్తున్నారు.
543 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాలీవుడ్ మార్కెట్ తప్పనిసరి. అలాంటప్పుడు టీజర్ లో అక్షయ్ కు సముచిత స్థానం కల్పించాల్సింది. కానీ మేకర్స్ చాలా పెద్ద తప్పుచేశారు. బాలీవుడ్ లో వసూళ్లు రాలేదని రిలీజ్ తర్వాత బాధపడొద్దంటూ చాలామంది హిందీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
మరోవైపు 2.0 సినిమా నుంచి బాలీవుడ్ వెర్షన్ లో మరో టీజర్ రిలీజ్ చేయాలనే డిమాండ్స్ కూడా ఊపందుకున్నాయి. ఆ వెర్షన్ లో అక్షయ్ కుమార్ యాంగిల్ ను ప్రజెంట్ చేయాలని చాలామంది డిమాండ్స్ చేస్తున్నారు. అప్పుడు మాత్రమే హిందీ మార్కెట్లో 2.0కు కాస్త క్రేజ్ వస్తుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడడం విశేషం.
ఇవన్నీ ఒకెత్తయితే, టీజర్ లో కొత్తదనం ఎక్కడుందంటూ ప్రశ్నించే వాళ్లు కూడా ఎక్కువయ్యారు. ఆల్రెడీ లీకైన టీజర్ ను చాలామంది చూసేశారని, దాని స్థానంలో కొత్త టీజర్ విడుదల చేయాల్సింది పోయి, లీకైన టీజర్ కే మెరుగులద్ది మార్కెట్లోకి వదిలేశారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయంలో లైకా ప్రొడక్షన్స్ కాస్తా లేజీ ప్రొడక్షన్స్ గా మారిందంటున్నారు చాలామంది.
ఏదేమైనా 2.0 టీజర్ సౌత్ లో ఎంత హిట్ అయిందో, బాలీవుడ్ లో అన్ని విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ టీజర్ కు వస్తున్న డిస్-లైక్స్ అన్నీ బాలీవుడ్ జనాలు కొడుతున్నవే. ఈ వ్యతిరేకతను 2.0 టీం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.