సినిమా రివ్యూ: యు టర్న్‌

రివ్యూ: యు టర్న్‌ రేటింగ్‌: 3/5 బ్యానర్‌: శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌, వి.వై. కంబైన్స్‌ తారాగణం: సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక, రవిప్రకాష్‌, హరితేజ తదితరులు సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి…

రివ్యూ: యు టర్న్‌
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌, వి.వై. కంబైన్స్‌
తారాగణం: సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక, రవిప్రకాష్‌, హరితేజ తదితరులు
సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
కూర్పు: సురేష్‌ ఆరుముగమ్‌
ఛాయాగ్రహణం: నికేత్‌ బొమ్మిరెడ్డి
నిర్మాతలు: శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు
రచన, దర్శకత్వం: పవన్‌ కుమార్‌
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 13, 2018

కొన్ని మీటర్ల దూరం ప్రయాణించడం ఇష్టం లేక, కొన్ని నిమిషాలు ఎక్కువ సమయం రోడ్డుపై వుండలేక… ట్రాఫిక్‌ రూల్స్‌ని వయొలేట్‌ చేసేవాళ్లు నిత్యం మనకి ఎంతో మంది కనిపిస్తుంటారు. కదపగలిగే డివైడర్స్‌ వుంటే కనుక, బైక్‌ ఆపి… వాటిని తప్పించి, వెనక వచ్చే వారికి జరిగే ప్రమాదాన్ని విస్మరించి తమ చిన్న స్వార్ధం చూసుకునే వాళ్లు చాలా మందే వుంటారు. కాస్త దూరం వెళ్లి యు టర్న్‌ తీసుకోవాల్సి వస్తుందని రాంగ్‌ రూట్లో భారీ వాహనాలతో ఎదురొచ్చి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకులయ్యే వారి గురించి నిత్యం వార్తల్లో చూస్తూనే వుంటాం.

మనకి రోజూ ఎదురయ్యే ఇలాంటి సంఘటనలు ఆధారం చేసుకుని ఒక ఆకట్టుకునే థ్రిల్లర్‌ సినిమాని అందించాడు దర్శకుడు పవన్‌ కుమార్‌. కన్నడలో ప్రశంసలు అందుకుని, విజయవంతమైన 'యు టర్న్‌' చిత్రాన్ని తెలుగు, తమిళంలో అదే పేరుతో సమంత తదితరులతో రీమేక్‌ చేసారు. ఒరిజినల్‌ దర్శకుడే రీమేక్‌ డైరెక్ట్‌ చేయడంతో ఒరిజినల్‌కి కట్టుబడి, ఎక్కువ మార్పులు చేయకుండా, మళ్లీ అదే సిన్సియారిటీతో ఈ చిత్రాన్ని తీసాడు.

జర్నలిస్టుగా ఏదో సాధించాలనే తపన వున్న రచనకి (సమంత) ఓ ఫ్లయ్‌ ఓవర్‌పై డివైడర్‌ రాళ్లు జరిపి, రాంగ్‌ యు టర్న్‌ తీసుకునే వాళ్ల మనస్తత్వంపై స్టోరీ చేయాలని వుంటుంది. ఈ క్రమంలో ఆమె ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్లి వస్తుంది. కానీ అదే రోజు సాయంత్రం సదరు వ్యక్తి మరణానికి కారకురాలివంటూ ఆమెని పోలీసులు అరెస్టు చేస్తారు. ట్రాఫిక్‌ వయొలేటర్స్‌ మనస్తత్వం తెలుసుకోవాలని అనుకున్న రచనకి ఇంకా పెద్ద ఛాలెంజ్‌ ఎదురవుతుంది. ఆ రాంగ్‌ యు టర్న్‌ తీసుకున్న వారంతా అదే రోజు సాయంత్రం అనూహ్య పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటూ వుండడంతో పోలీసులకి ఇదో సవాల్‌గా మారుతుంది.

ఈ థ్రిల్లర్‌ని చాలా క్యాజువల్‌గా స్టార్ట్‌ చేస్తాడు దర్శకుడు. ఒక పావుగంట సమయం ఎలాంటి టెన్షన్‌ లేకుండా సాగే కథలో ఒక్కసారిగా కుదుపు. పోలీస్‌ స్టేషన్‌లో ఇంటరాగేషన్‌, ఒకదాని తర్వాత ఒకటిగా బయటపడే నమ్మలేని నిజాలు… ఆ ప్రాసెస్‌ అంతా చాలా సహజంగా, సరాసరి పోలీస్‌ స్టేషన్‌ మధ్యలో వుండి వీక్షిస్తున్నట్టు అనిపిస్తుంది. నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి నిజంగానే ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్న భావన కలిగిస్తారు. దర్శకుడు పవన్‌ ఈ చిత్రాన్ని సినిమాలా కాకుండా చాలా రియలిస్టిక్‌గా అనిపించేలా చిత్రీకరించిన విధానం కట్టి పడేస్తుంది. అత్యంత కీలకమైన 'యు టర్న్‌' లొకేషన్‌ కూడా అచ్చంగా మనకి ఎదురు పడే రోజువారీ ప్లేస్‌లో జరుగుతున్నట్టే వుంటుంది. ఎక్కడా సినిమా చూస్తోన్న అనుభూతి రానివ్వకుండా పాత్రల నడవడిక, వేషధారణ అన్నీ ఎంతో సహజంగా అనిపిస్తాయి.

ఫస్ట్‌ హాఫ్‌ బిగి సడలని ఉత్కంఠతో సాగే 'యు టర్న్‌' అసలు కారణం రివీల్‌ అయిన తర్వాత మాత్రం రిలాక్స్‌ అయిపోతుంది. వాస్తవాతీతంగా, ఇల్లాజికల్‌గా అనిపించే ఆ చివరి ఘట్టం థ్రిల్‌ని తగ్గించేసి, సగటు సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌లా మారిపోతుంది. లాస్ట్‌ సీన్స్‌ చాలా కన్వీనియంట్‌గా, సినిమాటిక్‌గా అనిపించడం ఈ చిత్రం ఫైనల్‌ ఇంపాక్ట్‌ని కాస్త తగ్గించేస్తాయి. అయితే అద్భుతమైన ఫస్ట్‌ హాఫ్‌, టేకింగ్‌, పర్‌ఫార్మెన్సెస్‌, టెక్నికల్‌ వేల్యూస్‌ 'యు టర్న్‌'ని ఈ జోనర్‌కి చెందిన చిత్రాల మధ్య స్పెషల్‌గా నిలబెడతాయి. చివరి ఘట్టంపై మరింత శ్రద్ధ తీసుకుని వుంటే ఇది మరింత గొప్ప సినిమాగా నిలిచి వుండేది కానీ కొన్ని బలహీనతలు వున్నప్పటికీ ఈ జోనర్‌ సినిమాలు ఇష్టపడే వారికి సంతృప్తినిస్తుంది.

సమంతకి తన ప్రతిభ చూపించేందుకు ఫుల్‌ స్కోప్‌ ఇచ్చిన క్యారెక్టర్‌. ఆమె ఏరికోరి ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుకోవడానికి కారణం ఆమె నటనలోనే తెలుస్తుంది. పోలీస్‌ స్టేషన్‌ నుంచి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గరే కుప్పకూలిపోయి నిలువెల్లా వణికిపోయే సన్నివేశంలో ఆమె నటన అద్భుతంగా వుంది. తెలుగు ఇంకా స్పష్టంగా పలకలేని తన బలహీనతతో సొంత డబ్బింగ్‌ చెప్పుకోవడం సాహసమే అనాలి. ఆమెకి సహాయపడే పోలీస్‌ పాత్రలో ఆది పినిశెట్టి నటన కూడా చాలా సహజంగా వుంది. రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక ఇద్దరికీ ఎక్కువ స్కోప్‌ దక్కలేదు.

సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నత ప్రమాణాలు పాటించింది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం మూడ్‌ మెయింటైన్‌ చేయడానికి, సన్నివేశాలని వాస్తవానికి దగ్గరగా ప్రెజెంట్‌ చేయడానికి దోహదపడ్డాయి. దర్శకుడిగా పవన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని హ్యాండిల్‌ చేసిన విధానం ప్రశంసలు అందుకుంటుంది. ఒరిజినల్‌ చూడని వారికి అయితే అతని పనితీరు మరింతగా నచ్చేస్తుంది. రెగ్యులర్‌ సినిమాల నుంచి బ్రేక్‌ కోరుకుని కొత్త రకం థ్రిల్లర్‌ని ఆస్వాదించే అవకాశాన్ని ఆ తరహా అభిరుచి వున్న ప్రేక్షకులకి 'యు టర్న్‌' కల్పిస్తుంది. థ్రిల్లర్‌ సినిమాలు ఎన్నో వస్తున్నా కానీ రిలేట్‌ చేసుకునే ఇన్సిడెంట్స్‌ ఆధారంగా అల్లిన ఈ పకడ్బందీ థ్రిల్లర్‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ వారాంతంలో వున్న ఆప్షన్స్‌లో సినిమాటిక్‌ థ్రిల్‌ని ఆశిస్తున్నట్టయితే కనుక 'యు టర్న్‌' తీసుకున్నందుకు మాత్రం ఖచ్చితంగా సంతృప్తి దక్కుతుంది.

బాటమ్‌ లైన్‌: ఆకట్టుకునే మలుపు!
-గణేష్‌ రావూరి