ముందునుంచి చెబుతున్నట్లే నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ ఏరియాల్లో ఎక్కడి నుంచో ఒకచోట నుంచి పోటీ చేస్తానని చిరకాలంగా బండ్ల గణేష్ చెబుతూ వస్తున్నారు. కానీ గణేష్ వ్యవహారాలు తెలిసినవారు దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.
ఆ మధ్య ఓసారి కుటుంబ సమేతంగా వెళ్లి రాహుల్ గాంధీని కూడా కలిసివచ్చారు. ఇప్పుడు ఆఖరికి కాంగ్రెస్ లో చేరిక ఖరారు అయింది. ఈరోజు బండ్ల గణేష్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసి లాంఛనంగా పార్టీలో చేరతారు. కానీ టికెట్ ఎక్కడ ఇస్తారు? మహాకూటమి ఈక్వేషన్లు, ఇతరత్రా వ్యవహారాలు అన్నవి తెలియాల్సి వుంది.
వాస్తవానికి రాజకీయాల్లోకి రావడం ద్వారా బండ్లగణేష్ కొత్త అవతారం ఎత్తుతున్నట్లే. కమెడియన్ గా చిన్న చిన్న పాత్రలు వేస్తూ, పౌల్ట్రీ రంగంలోకి వెళ్లారు. ఈ రెండూ పొంతనలేని రంగాలే. అక్కడ పౌల్ట్రీ రంగంలో మంచి బిజినెస్ సాధించి, నిర్మాణంలోకి దిగారు. అక్కడ ఢక్కా మెక్కీలు తిని, దాన్ని పక్కన పెట్టారు.
వివిధ కాంట్రావర్సీలు, కేసులు వున్న నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ రంగంలోకి వస్తున్నారు. ఇప్పుడు ఎలా వుంటుందో చూడాలి మరి.