బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్యో, ఆత్మహత్యో సీబీఐ విచారణలో ఇంకా తేలలేదు కానీ, విచారణలో వెల్లడైన విషయాలు అంటూ బాలీవుడ్ మీడియా రకరకాల ప్రచారాలను తెర మీదకు తెస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సన్నిహితులు, అతడి దగ్గర పని చేసిన వారు చెప్పిన మాటలంటూ.. సంచలన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఇందులో ఏవి వాస్తవాలో కానీ..ఇప్పటికే సుశాంత్ పై రేపిన సంచలనలకు తోడు ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారాన్ని కూడా రచ్చకు ఈడుస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వద్ద పనిచేసిన వ్యక్తి సీబీఐ అధికారులకు ఇచ్చిన సమాచారం.. అంటూ ఇండియాటుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర మీడియా వర్గాలు సంచలన కథనాలను ఇస్తున్నాయి. సుశాంత్ కు తను గంజాయి సిగరెట్లు చుట్టిచ్చినట్టుగా చెప్పాడట ఆ పని వ్యక్తి. సీబీఐ అధికారులతో అతడు ఆ విషయాన్ని చెప్పినట్టుగా ఆ మీడియా వర్గాలు కథనాలను ఇచ్చాయి. సుశాంత్ కు తను రెగ్యులర్ గా గంజాయి సిగరెట్లను చుట్టేచ్చినట్టుగా, అతడు చనిపోయిన తర్వాత గంజాయి స్టాక్ అంత ఖాళీ అయిన విషయాన్ని తను గమనించినట్టుగా ఆ వ్యక్తి సీబీఐ అధికారులకు చెప్పినట్టుగా మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి!
ఇటీవలే సుశాంత్ కూ సారాకూ బ్రేకప్ అంటూ ఒక వ్యక్తి స్పందించాడు. ఒక సినిమా షూటింగ్ సమయంలో వాళ్లిద్దరూ కలిసే ఉండేవారని అతడు చెప్పుకొచ్చాడు. సుశాంత్ మరణంపై అంతా రియా చక్రబర్తిని నిందిస్తుంటే.. సుశాంత్ కు సారాతో ఎఫైర్ ఉండేదంటూ, కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆఖరికి డ్రగ్స్ వ్యవహారాన్నీ సుశాంత్ మెడకు తగిలిస్తున్నట్టుగా ఉన్నారు.
ఇదంతా పరిశీలిన అనంతరం.. ఒక మాట గుర్తు రాకమానదు. ఆ మధ్య సైఫ్ అలీఖాన్ ఒక మాట అన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని గౌరవించండి, చనిపోయిన వ్యక్తితో రాజకీయాలు వద్దు.. అంటూ సైఫ్ అన్నాడు. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో బంధుప్రీతిపై రేగిన రచ్చ నేపథ్యంలో సైఫ్ ఆ వ్యాఖ్య చేశాడు. సినిమా అవకాశాలు చేజారుతున్నాయని, అప్పటికే సూపర్ హిట్స్ కొట్టిన యంగ్ హీరో ఆత్మహత్య చేసుకునే అవకాశాలు సాధారణంగా అయితే ఉండవు. బహుశా ఆ ఆలోచనతో సైఫ్ ఆ మాట అన్నాడేమో!
అయితే బాలీవుడ్ లో కొందరున్నారు. వారి వ్యక్తిగత అజెండాలు వారికి ఉన్నాయి. తమ జీవితంలో వారు కొన్ని ఎదురుదెబ్బలు తిన్నారు. ఆ తర్వాత ఒక స్థాయికి ఎదిగారు. అలాంటి వారు సుశాంత్ ఆత్మహత్యను తమ అజెండాకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి. వారు చాలక రాజకీయ నేతలూ సుశాంత్ మరణాన్ని తమకు అనుగుణంగా వాడుకుంటున్నారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఒకవేళ సుశాంత్ ది ఆత్మహత్యే అయితే.. అతడు ఏ పరిణామాలతో ఆ నిర్ణయం తీసుకున్నాడో కానీ..చనిపోయిన తర్వాత కూడా అతడిని వాడుకునే వాళ్లు మాత్రం వదలనట్టుగా ఉన్నారు.