కరోనా లాక్ డౌన్ ఆంక్షలను పూర్తిగా ఎత్తేసే దిశగా వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అంతరాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి ఆటంకాలూ ఉండకూడదని ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నియమాలనూ పెట్టడానికి లేదని తేల్చి చెప్పింది.
ఇదే క్రమంలో మిగతా వాటన్నింటిపై కూడా ఆంక్షలను ఎత్తేయడానికి కేంద్రం రెడీ అవుతోందని తెలుస్తోంది. సెప్టెంబర్ ఒకటి నుంచి థియేటర్ల రీ ఓపెన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని సమాచారం. ఆగస్టు 31తో అన్ లాక్-3 ముగియనుంది. ఫోర్త్ ఫేస్ అన్ లాక్ లో థియేటర్లకు, సినిమా షూటింగులకు కేంద్రం అనుమతిని ఇవ్వడమే తరువాయి అని సమాచారం.
ఇప్పటికే సినిమా షూటింగులకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి. అయితే స్టార్ హీరోలు సినిమాల షూటింగుకు ముందుకు రాలేదు. సీరియళ్ల షూటింగులు మాత్రం కొనసాగుతున్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. దమ్మూధైర్యం ఉన్న హీరోలు సెప్టెంబర్ ఒకటి నుంచి సెట్స్ మీదకు రావొచ్చు.
అలాగే థియేటర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా..జనం ఎంత వరకూ ముందుకు వస్తారనేది మాత్రం సందేహమే. థియేటర్లు తెరవడానికి అవకాశం ఇస్తే తాము అత్యంత సురక్షిత పరిస్థితుల మధ్యన సినిమాలను ప్రదర్శిస్తామంటూ పీవీఆర్ వాళ్లు ఆ మధ్య ఒక డెమో వీడియా కూడా విడుదల చేశారు. మల్టీప్లెక్స్ లలో అలాంటి ఏర్పాట్లు సాధ్యమేమో కానీ సాధారణ థియేటర్లలో అదంతా సాధ్యం కాకపోవచ్చు. దీంతో థియేటర్లు తెరిచినా జనాలు ఎగేసుకుని వెళ్లకపోవచ్చునేమో!