బాస్ ఈజ్ బ్యాక్ అన్నది మెగాభిమానుల ముచ్చటైన కలవరింత. అదే ఖైదీ నెం 150కి టాగ్ లైన్ కూడా. ఈ ఖైదీ నెంబర్ 150కి కాస్ట్యూమ్స్ స్టయిలిస్ట్ గా సుస్మిత కూ కమింగ్ బ్యాకే నట. మామూలుగా అయితే ఏ సినిమాకు ఇప్పుడు కాస్ట్యూమ్స్ డిజైనర్ తో అంతగా పని వుండడం లేదు. మరీ చిన్న సినిమాలకు కొత్త చిన్న నటులను వాళ్ల డ్రెస్ లను వాళ్లనే తెచ్చుకోమంటున్నారు. సీన్, క్యారెక్టర్ చెప్పి, సూటయినవి తెచ్చుకోమంటున్నారు.
మీడియం, పెద్ద సినిమాలకు హీరో, హీరోయిన్లకు ముందే డ్రెస్ లకు 15 నుంచి 25 లక్షలు ఇచ్చేస్తున్నారు. దాంతో వాళ్లే కొని తెచ్చుకుంటున్నారు. కానీ సెలబ్రిటీల భార్యలో, పిల్లలో తమ పేరు కూడా స్క్రీన్ మీద చూసుకోవాలనుకున్నా, తాము కూడా టాలీవుడ్ లోని 24 క్రాప్ట్ ల్లో ఏదో ఒకదాంట్లో మెంబర్లమే అని చెప్పుకొవాలనుకున్నా, ఇలాంటి డిజిగ్నేషన్ లు ఏదో ఒకటి కావాలి. అన్నింటి కన్నా సులువైన దారి ఏది అంటే హీరో, హీరోయిన్లకు కాస్ట్యూమ్స్ సెలెక్ట్ చేయడమే.
సరే, ఆ ముచ్చట అలా వుంచితే మెగా డాటర్ సుస్మిత ఖైదీ నెంబర్ 150 ద్వారా స్టయిలిస్ట్ గా రంగ ప్రవేశం చేస్తున్నారు. కానీ ఇది తొలి సినిమా కాదట. ఆమెకు కూడా ఇది కమింగ్ బ్యాకేనట. గతంలో ఆమె చిరు కోసం జై చిరంజీవ సినిమాకు తొలిసారి స్టయిలిస్ట్ గా పనిచేసారట. మళ్లీ ఇన్నాళ్లకు రెండో సినిమా చేస్తున్నారట. జై చిరంజీవి మంచి ఫలితం అయితే ఇవ్వలేదు. మరి ఈ సినిమా ఆ లోటు తీరుస్తుందేమో చూడాలి.