‘బాయ్ హుడ్’ రీమేక్ అంత ఈజీ కాదు కదా షారూక్!

బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తనయుడిని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ 'బాయ్ హుడ్' సినిమాను రీమేక్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా పేరు ఆస్కార్ అవార్డుల విషయంలో మార్మోగింది.…

బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ తనయుడిని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ 'బాయ్ హుడ్' సినిమాను రీమేక్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమా పేరు ఆస్కార్ అవార్డుల విషయంలో మార్మోగింది. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ ను అందుకోవడం ఖాయమనుకొన్నారు కానీ.. అది జరగలేదు. 

మరి ఈ సినిమా ఆస్కార్ బరిలో ఓడిపోయుండొచ్చు కానీ.. ఇది ఒక అలాంటిలాంటి సినిమా కాదు. అసాధారణ సినిమా! ఇంత వరకూ ప్రపంచంలో ఇలాంటి ఫార్ములాతో.. ఇలాంటి తీరున తీసిన సినిమా ఏదైనా ఉందో లేదో కూడా ఎంతో అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది. బహుశా ఇలాంటి ప్రయోగాత్మక సినిమా ఇంత వరకూ ఎవరూ తీసి ఉండకపోవచ్చు.. మళ్లీ తీయాలి అన్నా సాధ్యం కాకపోవచ్చు.. ఎందుకంటే.. 'బాయ్ హుడ్' సినిమా నిర్మాణానికి పట్టిన మొత్తం కాలం 12 సంవత్సరాలు!

ఒక కుర్రాడి జీవితంలోని 6 సంవత్సరాల వయసు నుంచి 18 యేళ్ల వరకూ వచ్చే మార్పులు.. అతడు ప్రపంచాన్ని చూసే తీరు, అతడిని ప్రపంచం చూసే తీరు.. లాంటి సంఘర్షణను కలిపి దర్శక, నిర్మాత రిచర్డ్ లింక్లేటర్ ఈసినిమాను తెరకెక్కించాడు. దీని కోసం ఆయన ఎలార్ కాల్ట్రేన్ అనే కుర్రాడిని ఎంచుకొని మొత్తం 12 సంవత్సరాల పాటు ఈ సినిమాను తెరకెక్కించాడు! ఒక్కో సంవత్సరంలో ఆ కుర్రాడితో నెల రోజుల పాటు షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశాడు!

ఈసినిమా తో పాటు ఆ కుర్రాడు పెరిగి పెద్దయ్యాడు. మరి ఏదో డబ్బు లేక సినిమాలు సంవత్సరాలకు సంవత్సరాలు నిర్మాణదశలో ఉండటాన్నే చూశాం.. అయితే పర్ఫెక్షన్ కోసం ఒకే సినిమాను12 యేళ్ల పాటు తీయడం మాత్రం అసాధారణం. ఇప్పుడు ఈ సినిమాను షారూక్ తనయుడితో రీమేక్ చేయనున్నారట! మరి ఏదో రీమేక్ చేస్తే చేయొచ్చునేమో కానీ.. హాలీవుడ్ స్థాయి పర్ఫెక్షన్ అయితే   అసాధ్యమనే చెప్పాలి. ఈ సినిమాను ఇప్పుడు మొదలు పెట్టి మరో పన్నెండేళ్ల పాటు కొనసాగిస్తూ.. చిత్రీకరించడం అయితే షారూక్ కు కూడా సాధ్యంకాకపోవచ్చు. ఎందుకంటే.. అద్భుతాలు ఒక్కసారే జరుగుతాయి!