క్రమశిక్షణ, నిబద్ధత వుంటే ఏ రంగంలోనైనా పైకి రావచ్చనేది నిజం. కేవలం సంపాదన కోసమే కాకుండా సమాజ హితవు కోసం కూడా దృష్టి సారించాలి సినిమా జనం. ఈ విషయంలో సూపర్ స్టార్ కృష్ణ ఎంతో అభినందనీయుడు. మొన్న జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎలక్షన్స్‌కు సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
డెబ్భయ్ ఏళ్ళు పై బడిన వయసులో కూడా ఆయన పోలింగ్ బూత్‌కి రావడం గొప్ప సంగతి. సూపర్ స్టార్ కంటే చాలా చాలా చిన్న వయసులో వున్న నేటి తరం యంగ్ హీరోలు ఓటింగ్‌కి డుమ్మా కొట్టడం ఆక్షేపణీయం. జనరల్ ఎలక్షన్స్‌లో ఓటెయ్యడానికి ఎలాగూ రారు, సినిమా ఓట్లనూ ఎగ్గొడితే ఎలా.? సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజు ఓటు వేసి తన ఉత్సాహాన్ని చాటుకోవడం ఎంతో స్ఫూర్తినిచ్చిందని కొందరు అనుకున్నారు.
ఏడొందల ఓట్లకు కూడా మూడొందల మందే హాజరు కావడం చూస్తుంటే, సొంత లాభానికి ఇచ్చే విలువ సంఘం కోసం ఇవ్వలేరని అర్థం అవుతుంది. హీరోలకు ఇలాంటి నిర్లక్ష్యం ఎందుకో అర్థం కాకుండా వుందంటున్నారు మరికొందరు. సొంత లాభం కట్టిపెట్టి, పరుల కోసం పాటుపడవోయ్.. అని గుజరాడ చెప్పిన మాటలు మరిచిపోయి వుంటారు. లేదా ఆ సంగతే తెలియకుండా వుంటారు.. మన హీరోలు. వెరీ బ్యాడ్.