గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిదంట. అలాగా వుంది హీరో అల్లుఅర్జున్ వ్యవహారం. అతగాడు పుట్టక ముందు నుంచే వుంది సినిమాలు-సమీక్షలు అన్నది. ఇప్పుడు ఈయన గారు కొత్తగా, సమీక్షలు అంటే ఇలా వుండాలి. కమర్షియల్ సినిమాను చూడడం నేర్చుకోవాలి. అసలు కమర్షియల్ సినిమా అంటే ఏమిటి? అందులో ఎన్ని జోనర్లు వుంటాయి. ఎంతకష్టం.
విదేశీ జనాలు ఇలా అన్ని తరహాల జోనర్లతో కూడిన మన కమర్షియల్ సినిమాలు చూడడానికి ఎంత తహతహలాడుతున్నారు. ఇలా చాలా విషయాలు చెప్పేసాడు ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో. సినిమా సమీక్షకులకు కమర్షియల్ సినిమా అంటే అంతగా కిట్టదు అన్నది బన్నీ మాటల సారాశం. అది నిజమే అయితే ఎన్నో కమర్షియల్ సినిమాలకు మంచి సమీక్షలు ఎందుకు వచ్చాయి. వస్తున్నాయి?
సమీక్ష అన్నది కేవలం వ్యక్తిగత అభిప్రాయం అన్నది బన్నీ మాట. నిజమే అనుకుందాం. అది తమ అభిప్రాయంతో కూడా ఏకీభవిస్తేనే కదా? జనం వాటిని చదివి ఓన్ చేసుకునేది. లేదూ అంటే పట్టించుకోరు కదా? ఇంకెదుకు బాధ. వ్యక్తిగత అభిప్రాయానికి స్టార్ రేటింగ్ లు ఇవ్వడం ఏమిటి? ఇదీ బన్నీ క్వశ్చను. అదీ వ్యక్తిగతమే అనుకుని ఊరుకోవచ్చు కదా?
జనాలకు అన్ని రకాలు కావాలనుకుంటారు. కారం, తీపి, డ్రింక్స్, ఇలా అన్నీ వుండాలి. అలా వుండేదే కమర్షియల్ సినిమా అని బన్నీ బాబు కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకువచ్చారు. ఈ విషయం జనాలకు తెలియంది కాదు, కానీ బన్నీ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అన్నీ జనాలకు కావాలి అన్నది కరెక్టే కానీ, ఆ అన్నీ అందించడానికి ఓ పద్దతి అన్నది వుండాలి. ఆ పద్దతి కరెక్ట్ గా వుంటే బాగుంటుంది. పెరుగు అన్నం ముందు, పప్పు అన్నం చివర్న అన్నట్లు కాదు కదా?
పైగా మన సినిమా యునీక్ అంట. ఆ యునీక్ ను కాపాడాలంట. మరి మన సినిమా యునీక్ అయితే విదేశీ సినిమాల సీడీలు ముందేసుకుని, కథలు అల్లడం ఎందుకో? ఒక విషయం బన్నీబాబు తెలుసుకోవాలి. సమీక్షలు ఏం రాసారు అన్నది కాదన్నయ్యా.. సినిమా ఎలా వచ్చింది అన్నది కీలకం.
జనానికి నచ్చితే రివ్యూ నెగిటవ్ అయినా సినిమా చూస్తారు. జనానికి నచ్చకపోతే, రివ్యూ పాజిటివ్ అయినా సినిమాను పక్కన పెడతారు. అందువల్ల సమీక్షకులను ఆడిపోసుకోవడంపై దృష్టి తగ్గించి, జనాలకు నచ్చే సినిమాలు ఏవీ అన్నది చూసుకోవడం బెటర్.