స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు. విక్రమ్ కుమార్ సినిమా స్క్రిప్ట్ సెకండాఫ్ దగ్గర ఎందుకు అలా నత్తనడగ నడుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఆసక్తికరమైన ఇన్ పుట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ ఒకపక్క విక్రమ్ కుమార్ తో చేయబోయే సినిమాకు సెకండాఫ్ స్క్రిప్ట్ రెడీ చేయిస్తూనే ఒక బాలీవుడ్ డైరక్టర్ తో డిస్కషన్లు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
క్లారిటీగా డిటైల్స్ తెలియడం లేదు కానీ, బాలీవుడ్ జనాలతో బన్నీ చర్చలు మాత్రం పక్కా వాస్తవం అని తెలుస్తోంది. ఆ చర్చలు బాలీవుడ్ సినిమా చేయడానికా? లేక, బాలీవుడ్ డైరక్టర్ తో తెలుగు సినిమా చేయడానికా? తెలుగులో డైరక్టర్లు అందుబాటులో లేరని బాలీవుడ్ డైరక్టర్ ను తెస్తున్నారా? లేక సరైనోడు సినిమా యూట్యూబ్ లో భయంకరమైన రికార్డులు సృష్టిస్తోంది. ఆ విధంగా నార్త్ జనాలకు బన్నీ బాగా పరిచయం అయ్యారు. అందువల్ల ఓసారి బాలీవుడ్ లో ట్రయిల్ వేద్దాం అనుకుంటున్నారా?
తెలుగు హీరోలు చాలామంది బాలీవుడ్ ట్రయిల్స్ వేసారు. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఏదో ఆ సరదా తీర్చుకుని వెనక్కు వచ్చేసారు. రామ్ చరణ్ జంజీర్ అయితే అరివీరభయంకర డిజాస్టర్ గా మిగిలింది. మరి ఇప్పుడు బన్నీ ఇవన్నీ తెలిసి ధైర్యం చేస్తాడా? అన్నది అనుమానం. ఇదిలా వుంటే బన్నీకి కూడా చాలా మంది హీరోల మాదిరిగానే వెన్నునొప్పి సమస్య ఏదో వున్నట్లు తెలుస్తోంది. విపరీతంగా వర్కవుట్ లు చేయడం, ఫైట్ల సీన్లలో తాళ్లు కట్టి లాగడం వంటి వాటి వల్ల హీరోలకు ఈ వెన్ను నొప్పి సమస్య వస్తుంటుంది.
బన్నీకి కూడా ఆ సమస్య వుందని, దానికి చిన్న శస్త్రచికిత్స అవసరం అని తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం బన్నీ గ్యాప్ తీసుకుంటున్నారా? అన్నది మరో అనుమానం. ఇక త్రివిక్రమ్ డైరక్షన్ లో బన్నీ మరోసారి సినిమా చేయాలనుకుంటున్నారు. రెండునెలలు ఆగితే త్రివిక్రమ్ ఫ్రీ అయిపోతారు. విక్రమ్ కుమార్ సెకండాఫ్ రెడీ కాకపోతే త్రివిక్రమ్ తో ముందుకు వెళ్తారా? అన్నది మరో విషయం.
శానం నాగఅశోక్ కుమార్, నల్లమలుపు బుజ్జి నిర్మాతలుగా విక్రమ్ కుమార్ సినిమా, హారిక హాసిని నిర్మాతగా త్రివిక్రమ్ సినిమా వుంటాయి. ఈ రెండింటిలో ఏది ముందు? మధ్యలో ఈ బాలీవుడ్ మేకర్లతో డిస్కషన్లు దేనికి? మరింత క్లారిటీ రావాలి. వెయిట్ అండ్ సీ.