రాబోయే సంక్రాంతికి మంచి పోటీ వుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు-స్టయిలిష్ స్టార్ బన్నీ.. యంగ్ మాస్ ఎంటర్ టైనర్ అనిల్ రావిపూడి.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీళ్ల వీళ్ల కాంబినేషన్ లో వచ్చే 'సరిలేరు నీకెవ్వరూ', 'అల వైకుంఠపురములో' సినిమాలు రాబోతున్నాయి సంక్రాంతికి. సంక్రాంతికే రజనీ కాంత్ దర్బార్, కళ్యాణ్ రామ్ 'ఎంత మంచి వాడవురా' సినిమాలు కూడా వున్నాయి. అయినా కూడా మహేష్, బన్నీల సినిమా మీదనే దృష్టి అంతా.
సంక్రాంతికి అని చెప్పానా కూడా ఇప్పటివరకు బన్నీ సినిమా డేట్ కానీ, మహేష్ సినిమా విడుదల తేదీ కానీ బయటకు రాలేదు. ఒకరు డేట్ ప్రకటిస్తే మరొకరు ఓపెన్ అవుదామని దాగుడుమూతలు ఆడుతున్నారు. అయితే ఈ విషయంలో అలవైకుంఠపురములో సినిమా నిర్మాతలకు మాత్రం ఓ క్లారిటీ వుంది. తమ సినిమా సంక్రాంతికి రెండో సినిమాగానే తప్ప మొదటి సినిమాగా కాదు అన్నది క్లారిటీ.
ఎప్పుడు మహేష్ బాబు సినిమా డేట్ వచ్చినా, ఆ మర్నాడు బన్నీ సినిమా విడుదల అన్నది లోలోపల ఫిక్స్ అయిపోయిన వ్యవహారం. ఇప్పుడు ఆ వ్యవహారానికి అనుగుణంగానే జనవరి 12 డేట్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జనవరి 12న ఆదివారం పడింది. సాధారణంగా శుక్రవారానికి ఒకటి రెండు ముందు రోజులు కాదంటే నాలుగు రోజులు ముందు సినిమా విడుదల చేయడం అలవాటే కానీ శుక్రవారం వెళ్లిన తరువాత ఆదివారం సినిమా విడుదల అన్నది చాలా రేర్ ఫీట్.
మరి ఈ రేర్ ఫీట్ ను ఏ స్ట్రాటజీతో ఎంచుకున్నారో నిర్మాతలు హారిక హాసినికి, దర్శకుడు త్రివిక్రమ్ కే తెలియాలి. శుక్రవారం ప్రీమియర్లు, శని ఆదివారాలు వీకెండ్ కలెక్షన్లు ఓవర్ సీస్ లో వుంటాయి. వాటిని వదులుకుంటున్నారు. మనదగ్గర అంటే ఫెస్టివల్ కాబట్టి హాలీడేస్ నే, కానీ ఓవర్ సీస్ సంగతేమిటి?
ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా పదవ తేదీ(శుక్రవారం) విడుదలవుతుందా? ఇంకా ముందుకు వచ్చి 9న విడుదలవుతుందా అన్నది చూడాలి.