రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కల్యాణ్ తాను నటుడిని అన్న సంగతి అస్సలు మర్చిపోవడంలేదు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ యాక్షన్ అని చెబితేనే తన పని మొదలు పెడతారు, కట్ చెప్పిన వెంటనే సైలెంట్ అయిపోతారు. అప్పట్లో డైరెక్టర్లు చెప్పినట్టు వినే పవన్ కు ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ డైరక్టర్ గా మారారు చంద్రబాబు. బాబు చెప్పినట్టల్లా తలాడిస్తున్నారు పవన్. ఇప్పటికే పలుమార్లు వీరి చీకటి ఒప్పందాలు బైటపడ్డాయి. చంద్రబాబు ఇంటికి నోటీసులిస్తే పవన్ బాబు ఫీలయిపోతుంటారు.
చంద్రబాబు తనకు కేటాయించాలన్న అక్రమ కట్టడాన్ని ప్రభుత్వం కూల్చేస్తే పవన్ కన్నీరు కారుస్తారు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు రెచ్చిపోతుంటే, ఏంటీ అన్యాయం అని పవన్, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఇదీ జనసేనాని తీరు, బాబు కీ ఇస్తే ఆడే బొమ్మలా మారిపోయారు పవన్ కల్యాణ్. మధ్య మధ్యలో బీజేపీ సపోర్ట్ తీసుకుంటున్నా.. చంద్రబాబు పట్ల మాత్రం తన వీర విధేయతను చూపించుకుంటున్నారు. జగన్ 100 రోజుల పాలనపై విడుదల చేసిన నివేదిక కూడా ఈ విధేయతలో భాగమే.
అయితే తాజాగా పవన్ కల్యాణ్ గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామక ప్రక్రియపై తనదైన శైలిలో ట్వీట్లు పెడుతున్నారు. ఎంక్వయిరీ వేయాలని, నిజాలు నిగ్గు తేల్చాలని, ప్రభుత్వం దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో లోపాలున్నాయని ఏ నిరుద్యోగీ రోడ్డెక్కలేదు, కేవలం టీడీపీ ప్రేరేపిత, టీడీపీ-బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు మాత్రమే ఆందోళనలతో హడావిడి చేస్తున్నాయి. ఇవన్నీ చూసి పవన్ కల్యాణ్ కూడా ఏదో జరిగిపోతోందని భ్రమ పడుతున్నారు. అందుకే ఆయన కూడా స్పందించారు. ఏవేవో ట్వీట్స్ పెట్టేశారు.
ఇవన్నీ బాబు సూచనల మేరకే జరిగాయనే విషయం ఆ ట్వీట్స్ చూస్తేనే తెలుస్తోంది. ఎందుకంటే.. అవి చూస్తుంటే అచ్చం చంద్రబాబే గుర్తొస్తున్నారు మరి. కాకపోతే బాబు సీబీఐ ఎంక్వయిరీ కోరితే, జనసేనాని ఓన్లీ ఎంక్వయిరీతో సరిపెట్టారు. ఉద్యోగాలన్నీ అధికార పార్టీ నేతలు చెప్పినవారికే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్. పేపర్ లీకేజీపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఇలా పూర్తిగా చంద్రబాబుకి జిరాక్స్ లా మారారు పవన్ కల్యాణ్. ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటే, అయితే ఆ విమర్శలు తమ పరువు తీసేలా ఉండకూడదనే విషయాన్ని మాత్రం పవన్ కల్యాణ్ గ్రహించాలి.
యెల్లో మీడియా ఉచ్చులో పడి పవన్ కూడా అదే నిజమనే భ్రమలో ఉన్నారు. చంద్రబాబు లేవనెత్తిన అంశాల్నే తిరిగి పవన్ కల్యాణ్ కూడా హైలెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కల్యాణ్ ఇలా పసలేని ఆరోపణలు చేస్తే.. పాతికేళ్లు కాదు కదా.. యాభై ఏళ్లు వేచి చూసినా ప్రజాబలం సంపాదించలేరు. అసలే యువత మద్దతు ఎక్కువగా ఉందని ప్రతిసారి చెప్పుకుంటారు జనసేన. నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం చేస్తే ఆ యువతే ఆయనకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది.