బీజేపీకి షాకిచ్చిన ఎన్నికల కమిషన్!

భారతీయ జనతా పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. కర్ణాటకలో ఉప ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తేదీలను కూడా అనౌన్స్ చేసింది. అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన కర్ణాటకలో పదిహేను అసెంబ్లీ…

భారతీయ జనతా పార్టీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. కర్ణాటకలో ఉప ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తేదీలను కూడా అనౌన్స్ చేసింది. అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన కర్ణాటకలో పదిహేను అసెంబ్లీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నట్టుగా, ఆ తర్వాత రెండ్రోజులకు ఫలితాలను వెల్లడించనున్నట్టుగా ఈసీ ప్రకటించింది. ఇది భారతీయ జనతా పార్టీకి పెద్ద ఝలక్ అని చెప్పవచ్చు.

ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం పడిపోవడానికి కొంతమంది ఎమ్మెల్యేల తిరుగుబాటే కారణం అని చెప్పనక్కర్లేదు. అలాంటి వారిపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్, జేడీఎస్ లకు ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలందరి మీదా అనర్హత వేటు వేసి ఆయన స్పీకర్ పదవి నుంచి వైదొలిగారు. అనర్హత వేటే గాక.. తిరుగుబాటు ఎమ్మెల్యే ఇప్పుడప్పుడే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా నిషేధం విధించారు కూడా.

అనర్హత వేటుపై, తమపై నిషేధంపై సదరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. కోర్టు విచారణ సాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. వారు ప్రాతినిధ్యం వహించిన స్థానాలకు ఈసీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వారి స్థానాలకు ఎన్నికలు జరగనుండటం మాత్రమే కాకుండా, వారు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ అభ్యర్థులు ఇప్పుడు గగ్గోలు పెట్టే పరిస్థితి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

ఇక ఈ ఉప ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి కూడా పెద్ద తలనొప్పే. అసలే బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వం నడుస్తోంది. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు సత్తా చూపిస్తే.. బీజేపీ ఈ సీట్ల మెజారిటీ సాధించలేకపోతే.. మళ్లీ రెడ్డొచ్చా.. మొదలాడు.. అన్నట్టుగా మారుతుంది పరిస్థితి. ఉప ఎన్నికలను ఎదుర్కొనడానికి తగినంత ఇమేజ్ తో లేదు కర్ణాటక బీజేపీ… అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.