దాదాపు రెండు నెలలుగా పోటాపోటీ కంటెంట్ లతో హోరెత్తుతోంది టాలీవుడ్. అల వైకుంఠపురములో సరిలేరు నీకెవ్వరు హడావుడి ఇంతాఅంతాకాదు. అంతకు ముందు సినిమాల విడుదల డేట్ కోసం కిందా మీదా అయ్యారు. రెండు సినిమాలు ఒకే రోజు అంటే జనవరి 12న విడుదలకు సిద్దమయ్యాయి. ఆఖరికి ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని, హీరో మహేష్ ను ఒప్పించి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను జనవరి 11కు పంపించారు.
తాము వెనక తప్ప ముందు రాము గాక రాము అని బన్నీ సినిమా యూనిట్ పట్టుపట్టి జనవరి 12న ఫిక్సయింది. అక్కడి నుంచి రెండు సినిమాల మధ్య పోరు ఫ్యాన్స్ కే పరిమితం అయింది. ఇలాంటి నేపథ్యం లో సినిమాల విడుదల మరో పది రోజుల్లోకి వచ్చిందనగా అల వైకుంఠపురములో సినిమా డేట్ మారుతోందన్న వార్త టాలీవుడ్ లో సంచలనం కలిగించింది.
సరిలేరు నీకెవ్వరు సినిమా డేట్ 12 నుంచి 11 కు మారుతోందని అన్ని మీడియాల కన్నా ముందుగా అందించిన గ్రేట్ ఆంధ్రనే, ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమా డేట్ మారుతోందన్న వార్తను కూడా ఎక్స్ క్లూజివ్ గా మిగిలిన మీడియాల కన్నా ముందుగా అందించింది. ఇప్పుడు దీని వెనుక ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది అన్న విషయాలు కూడా ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం.
మహేష్ కూడా 10నే
బన్నీ సినిమా యూనిట్ డేట్ మారుస్తున్నారన్న వార్త తెలియగానే హీరో మహేష్ కు తీవ్ర ఆగ్రహం కలిగినట్లు తెలుస్తోంది. ఆయన వెంటనే తన సినిమా నిర్మాత అనిల్ సుంకర ను పిలిచి తన మాట స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రీ పెద్దలు అందరూ చెప్పారు కాబట్టి, ఓ రోజు ముందుకు జరిగానని, ఇప్పుడు అడ్డగోలుగా నిర్ణయం మార్చుకుని, డేట్ ను రెండు రోజులు ముందుకు జరిపితే, ఇక తను ఎవ్వరి మాట విననని, తన సినిమా కూడా 10నే విడుదల చేస్తానని మహేష్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సినిమా రెడీ చేయమని ఆయన అనిల్ సుంకరకు స్పష్టం చేసారు. అంతే కాదు, ఈ విషయం అల వైకుంఠపురములో సినిమా నిర్మాతలకు స్పష్టం చేయమని చెప్పారు. దాంతో అనిల్ సుంకర నేరుగా అల వైకుంఠపురములో నిర్మాతలకు ఫోన్ చేసి ఈ విషయం క్లియర్ చేసారు.
మహేష్ ఫై ఆరోపణ
బన్నీ పర్సనల్ యూనిట్ వైపు నుంచి ఓ మాట వినిపిస్తోంది. మహేష్ ఎక్కడో ఏ పార్టీలోనో ఎవరితోనో మాట్లాడుతూ, బన్నీని, బన్నీ సినిమాను తక్కువ చేసి మాట్లాడారని, ఆ విషయం తెలిసి, బన్నీ తన సినిమా డేట్ ను మార్చాలని అనుకున్నారని అంటున్నారు. కానీ ఇది కావాలని సింపతీ కోసం పుట్టించారని, మహేష్ అలా అనలేదని, నిజానికి గత నాలుగయిదు రోజులుగా మహేష్ ఫుల్ బిజీగా వున్నారని, ముంబాయిలో డెంటిస్ట్ దగ్గరకు వెళ్లడం, అక్కడ ఓ యాడ్ షూట్ లో పాల్గొనడం, తరువాత షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవడం ఇలా ఫుల్ బిజీగా వున్నారని అంటున్నారు.
అన్ని వేళ్లు బన్నీ వైపే
ప్రస్తుతం బన్నీ విదేశాల్లో వున్నారు. 3న తిరిగి వస్తారు. అప్పుడు బన్నీ మనసు మార్చుకుంటే 12న లేదంటే 10న అలవైకుంఠపురములో సినిమా విడుదల వుంటుంది. కానీ ఇండస్ట్రీ జనాలు ఈ విషయంలో ముమ్మాటికీ బన్నీది, ఆయన చుట్టూ వున్న మనుషులదే తప్పు అంటున్నారు. తాము ముందుకు రాము, వెనకే వస్తాము అని ముందు నుంచి చెప్పి, ఇప్పుడు ఇలా చేయడం నైతికంగా తప్పు అని ఇండస్ట్రీలో యునానిమస్ కామెంట్ వినిపిస్తోంది. తప్పు అన్న సంగతి అల్లు అరవింద్ కు తెలిసినా, బన్నీకి ఆయన చుట్టూ వున్న మనుషులకు నచ్చ చెప్పలేక మౌనం వహించినట్లు తెలుస్తోంది. దీంతో అల వైకుంఠపురములో సినిమా నిర్మాతలు కూడా తమ అభ్యంతరం చెప్పి,మౌనం వహించినట్లు తెలుస్తోంది.
10 అంటే అంత వీజీ కాదు
నిజానికి అల వైకుంఠపురములో సినిమాను 10 కి మార్చడం అంత వీజీ కాదు. 11 న సరిలేరు సినిమా కోసం థియేటర్లు అన్నీ అగ్రిమెంట్ చేసి వున్నాయి. ఇప్పుడు 10న బన్నీ సినిమా విడుదల చేస్తే, 11న థియేటర్లు ఇవ్వడం అన్నది అంత సులువు కాదు. అగ్రిమెంట్లు చింపేసి కొత్తవి రాయాలి. ఈ విషయంలో ఎగ్జిబిటర్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతారు.
అటు సురేష్ బాబు, ఏషియన్ సునీల్, ఇటు అల్లు అరవింద్, యువి వంశీ లాంటి వాళ్లు టగ్ ఆఫ్ ది వార్ అన్నట్లుగా థియేటర్ల ఆట ఆడాల్సిందే. రెండు సినిమాల్లో ప్రమేయం వున్న దిల్ రాజు లాంటి వాళ్లు మధ్యలో నలగాల్సిందే.
పైగా ఓవర్ సీస్ లో రెండు సినిమాలకు వేలాది మంది టికెట్ లు బుక్ చేసుకున్నారు. వీరంతా ఇప్పుడు తమ టికెట్ లు క్యాన్సిల్ కొట్టి, మళ్లీ మొదటి రోజుకు కొత్తగా బుక్ చేసుకోవాలి. ఇది చిన్న విషయం కాదు. పైగా రెండు సినిమాలు ఒకనాడు అంటే రెండు సినిమాల టికెట్ రేటు తేడా వుంటుంది కాబట్టి, సరిలేరు యూనిట్ ఆ రేటును తగ్గించాల్సి వుంటుంది. అది సాద్యం కాకపోతే రేటు మధ్య పోటీ వుంటుంది.
బన్నీదే ఫైనల్ డెసిషన్
ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత బన్నీమీదే వుంది. ఎందుకంటే హీరోల ముందు నిర్మాతలు నిమిత్త మాత్రులే. అందువల్ల కంటెంట్ రెడీ చేసి, 3న సెన్సారుకు సిద్దం చేసి రెడీగా వున్నారు. తమకు 12న రావడమే ఇష్టమని బన్నీటీమ్ కు తెలియచేసారు. ఇక బన్నీ మూడున తిరిగివచ్చి, ఏది అంటే అదే ఫాలో కావడం తప్ప చేసేది ఏమీ లేదని బన్నీ సినిమా నిర్మాతలు భావిస్తున్నారు.