గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని పవన్‌కల్యాణ్ పార్టీ ఘోర ఓటమిపాలైంది. అంతేకాదు పార్టీ అధ్యక్షుడు పవన్ గాజువాక, భీమవరంలో రెండు చోట్లా ఓడిపోయాడు.రాజధాని పర్యటనలో పవన్ మాటలను వింటుంటే తాను ఓడిపోయిన బాధకంటే చంద్రబాబు ఓటమే ఆయన్ను విపరీతంగా ఆందోళనకు గురి చేస్తున్నట్టు అర్థమవుతోంది.
‘అమరావతిలో నిర్మించిన భవనాలు, చేసిన అభివృద్ధి గురించి గత తెలుగు దేశం ప్రభుత్వం ప్రపంచానికి చూపించలేదు. ఎక్కడో నిర్మాణం జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించారు తప్పితే రాజధానిని చూపించలేదు. అదే ఆ పార్టీ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపాడు.
అంటే అమరావతిలో నిర్మాణాలను చూపి ఉంటే జనాదరణకు నోచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చేవారనేది ఆయన మనసులో మాట. అమరావతిలో ఏ ఒక్క శాశ్వత కట్టడం లేదని, అంతా గ్రాఫిక్ మాయాజాలం అని లోకం కోడై కూస్తుంటే పవన్‌కు మాత్రమే కనిపించే మహానగరం అమరావతిలో ఎక్కడుందో? అలాగే ఆ రోజున నేను గొంతు చించుకుని అరిచినా మీరు నమ్మలేదని, ఒకే ఒక్క చాన్స్ ఫ్లీజ్ అని అడిగితే జగన్‌రెడ్డికి పట్టం కట్టారని పవన్ అన్నాడు.
గొంతు చించుకుని అరిచింది మళ్లొకసారి చంద్రబాబుకు పట్టం కట్టాలని కాదా పవన్? ఒక్కచాన్స్ ఫ్లీజ్ అని అడిగే నైతిక హక్కు మీరెందుకు అడగలేక పోయారు? ఎంతసేపూ చంద్రబాబును గద్దెనెక్కించాలనే తపన, జగన్‌ను అధికారానికి చేరువగా రానివ్వకూడదనే అసూయ…ఇంతకు మించి మీ మనసులో మరో ఆలోచన ఉందా పవన్?
రాజధానిపై పవన్ ఏం మాట్లాడుతున్నారో తనకే తెలియని అయోమయంలో ఉన్నాడు. ఒక్కోచోట ఒక్కోరకంగా ఆలోచన కొరవడి, ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్లో ఒకదాని కొకటి పొంతన కుదరడం లేదు.‘జై అమరావతి అంటే అదేదో మీ ప్రాంత సమస్యలా అందరూ అనుకుంటారు. వైసీపీ వాళ్లు కూడా దీనినే ప్రజల్లోకి తీసుకెళ్తారు.
మీరు జై ఆంధ్ర నినాదంతో ముందుకెళ్లండి’ అని రాజధాని రైతులకు పవన్ ఉద్యమ చిట్కా చెప్పాడు. అయ్యా పవన్ గారూ మీరు చెప్పినా చెప్పకపోయినా అది కేవలం ఒక సామాజికవర్గ సమస్య అని రాష్ట్ర ప్రజానీకం ఒక అభిప్రాయానికొచ్చింది. జై ఆంధ్రా అని అనాల్సింది అమరావతి రైతులు కాదు…మిగిలిన ప్రాంతాల ప్రజానీకం అని తెలుసుకుంటే మంచిది.