దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యూ ఇయర్ లో గుడ్ న్యూస్ అందించింది జగన్ సర్కార్. ఇకపై కేజీ ఉల్లిని 15 రూపాయలకే అందించాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
ప్రస్తుతం రైతుల నుంచి కిలో ఉల్లిని 60 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీన్ని కిలో 15 రూపాయల చొప్పున వినియోగదారునికి అందించాలని నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల అటు రైతుకు, ఇటు ప్రజలకు లాభం చేకూరనుంది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని 101 రైతుబజార్లలో ఉల్లిని 15 రూపాయలకే అమ్మబోతున్నారు.
అయితే ఈ నిర్ణయాన్ని మరిన్ని రైతుబజార్లకు విస్తరించడం ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది. ఎందుకంటే, ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేద్దామన్నప్పటికీ ఉల్లి అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం రోజుకు 60 టన్నుల వరకు కొనుగోలు చేస్తున్న మార్కెటింగ్ శాఖ.. మరింత ఉల్లి కోసం ఈజిప్ట్, టర్కీ నుంచి నిల్వల్ని దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది.
ఒకవేళ ఈజిప్ట్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే, అప్పుడు 15 రూపాయలకే కిలో ఉల్లిని అమ్మడం ప్రభుత్వానికి మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కిలో ఉల్లిని 40 రూపాయల లెక్కన విక్రయిస్తోంది. జగన్ సర్కార్ మాత్రం ఖర్చు ఎక్కువైనా కిలో 15 రూపాయలకే అమ్మాలని నిర్ణయించింది. ఏపీ, తెలంగాణలో మార్కెట్ రేటు ప్రకారం కిలో ఉల్లిని ప్రస్తుతం 70-80 రూపాయలకు విక్రయిస్తున్నారు.