బన్నీ.. మహేష్.. ఫైట్ ఆపేందుకు..

దగ్గుబాటి సురేష్ బాబు, కెఎల్ నారాయణ, దిల్ రాజు, ఇలా ఒకరిద్దరు ముగ్గురు కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్ణయాలను వెనుక వుండి ప్రభావితం చేయగల పెద్దలు మరి కొందరు ఇప్పుడు రంగంలోకి దిగారు.…

దగ్గుబాటి సురేష్ బాబు, కెఎల్ నారాయణ, దిల్ రాజు, ఇలా ఒకరిద్దరు ముగ్గురు కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ నిర్ణయాలను వెనుక వుండి ప్రభావితం చేయగల పెద్దలు మరి కొందరు ఇప్పుడు రంగంలోకి దిగారు. మంతనాలు జరుపుతున్నారు. ఇదంతా దేని కోసం. బన్నీ.. మహేష్ బాబు ఫైట్ ను ఆపేందుకు.

భరత్ అనే నేను, నా పేరు సూర్య అనే రెండు సినిమాలు, కాదు కాదు, ఆ రెండు సినిమాల విడుదల తేదీలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాయి. రెండు సినిమాలు పోటాపోటీగా ఒకే డేట్ ను లాక్ చేయడంతో, బయ్యర్లు, ఎగ్జిబిటర్లలో కంగారు మొదలయింది. మంచి బిజినెస్ ఆపర్యూనిటీని పాడు చేసుకుంటున్నామని కిందా మీదా అయిపోతున్నారు.

రెండు విడివిడిగా వచ్చి హిట్ అయితే కనుక వంద కోట్లకు పైగా వ్యాపారం. థియేటర్లకు పండగే పండగ. అదే కనుక రెండూ పోటీ పడితే, హిట్ అయినా కూడా చాలా వరకు లెక్కలు తేడా వచ్చేస్తాయి. అదే పొరపాటున ఏ సినిమా అయినా పలితం తేడా వస్తే, బయ్యర్లు బకెట్ తన్నేస్తారు.

పోటీ ఎవరికి చెపుదామన్నా, విషయం హీరోల చేతుల్లోకి పోయింది. ఇగో సమస్యలు ఎవరెస్ట్ అంత పెరిగిపోయాయి. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వీళ్ల సమాలోచనలు, ఆ తరువాత తప్పకుంటే చాంబర్ ఇంటర్ ఫియరెన్స్ తో సమస్య కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. 

ఇందులో సూచిస్తున్న పరిష్కారం ఏమిటంటే, ఏప్రియల్ 26ను ఇద్దరు హీరోలు వదిలేయాలి. ముందుకో వెనక్కో కదలాలి. కానీ ఇక్కడే తకరారు వస్తోంది. నా పేరు సూర్య సినిమా వారం ముందుకు జరగడానికి రెడీనే. అంటే ఏప్రియల్ 20కి. కానీ అంతకన్నా ముందుకు జరగాలంటే మాత్రం వర్క్ పూర్తవదని అనుమానం. అప్పుడు భరత్ అనే నేను ముందుకు జరగలేదు. వెనక్కు వెళ్లాలి అంటే మే నెలలోకి వెళ్లాలి. అది మహేష్ సెంటిమెంట్ ప్రకారం కుదరని పని.

పోనీ భరత్ అనే నేను పని కిందా మీదా పడి ఫినిష్ చేసి వారం ముందుకు తీసుకువచ్చి, నా పేరు సూర్యను మే లోకి వెళ్లమని అంటే, కాదు, ముందుకు వస్తాము కానీ, వెనక్కు వెళ్లమని అంటున్నారని టాక్. అంటే ఏప్రియల్ 12, 13 అలాగే 20తేదీల్లో రెండు సినిమాలు ఫిక్స్ కావాలి. లేదా ఎవరో ఒకరు 26 డేట్ వాడుకోవడానికి ఇరువర్గాల అంగీకారం కుదరాలి. ఇది సాధ్యమేనా?

ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల కసరత్తు దాని మీదే.