టాలీవుడ్ లో ఇప్పుడు లేటెస్ట్ డిస్కషన్ ఇదే. నిర్మాత సి కళ్యాణ్ ఇదంతా కావాలని చేస్తున్నారా? అత్యుత్సాహంతో చేస్తున్నారా? అన్నదే. ఆయన వైఖరి కారణంగా ఇండస్ట్రీ ఏకతాటిపైకి రాకఫోగా, విబేధాలు పెరుగుతున్నాయన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చిత్రంగా ఇండస్ట్రీలో ఇటీవల విబేధాలకు కారణమైన విషయం జరిగినపుడల్లా సి కళ్యాణ్ పేరు వినిపించడం.
చిరంజీవి-మంత్రి తలసాని తదితరుల మీటింగ్ తరువాత హీరో బాలకృష్ణ స్పందించిన తరువాత కూడా కళ్యాణ్ కొన్ని కామెంట్లు చేసారు. బాలయ్య ప్రస్తుతం ఏ సినిమా చేయడం లేదని పిలవలేదు అనే అర్థం వచ్చేలా చెప్పారు. అది వివాదాస్పదం అయింది.
అయితే బయటకు రాని విషయం ఒకటి వుంది. తలసానితో మెగాస్టార్ ఇంట్లో సమావేశం అనంతరం ఆంధ్ర సిఎమ్ కు ధన్యవాదాలు చెబుతూ ఓ లేఖ రాద్దామనే ఆలోచన వచ్చింది. ఆంధ్రలో షూటింగ్ ల విషయంలో అక్కడి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడానికి స్పందనగానే ఈ లేఖ రాయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో 'అక్కడికి వెళ్లి ఎవరు షూటింగ్ లు చేస్తారు. రూపాయికి పది రూపాయలు ఖర్చు అవుతుంది' అని సి కళ్యాణ్ కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కామెంట్ మెగాస్టార్ ఇంటి బయట చేసినా, బహిరంగంగా చేయడంతో వైకాపా దృష్టికి వెళ్లినట్లు, వైకాపా కీలక నేత అయిన వైవి సుబ్బారెడ్డి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఆంధ్ర సిఎమ్ జగన్ ఈ నెల 9న అపాయింట్ మెంట్ ఇచ్చారు టాలీవుడ్ జనాలకు. ఇరవై మంది వరకు రమ్మని మని చెప్పారు. థియేటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్, స్టూడియో సెక్టార్ల నుంచి ఇద్దరేసి, మా నుంచి ఇద్దరు, 24 క్రాఫ్ట్స్ బాడీ నుంచి ఇద్దరు, చాంబర్ నుంచి ఇద్దరు, వీరు కాక చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, విజయచందర్ ఇలా కొందరిని ఎంపిక చేసారు. అలాగే బాలయ్య ను కూడా. బాలయ్య రావాలంటే మెగాస్టార్ పిలవాలి.
కానీ ఈలోగానే సి కళ్యాణ్ పిలిచేయడం, ఆయన తన బర్త్ డే పనుల వల్ల రాలేనని చెప్పడం అయిపోయింది. పోనీ అప్పుడన్నా ఈ విషయం మెగాస్టార్ కు చెబితే ఆయన స్వయంగా మరోసారి నచ్చచెప్పే ప్రయత్నం చేసేవారేమో, కానీ ఈ లోగానే సి కళ్యాణ్ ఈ విషయాన్ని మీడియా ముందు చెప్పేసారు. దాంతో ఇప్పుడు బాలయ్యను పిలిచే దారులు మూసుకుపోయాయి.
ఏం కోరాలని?
ఇంతకీ టాలీవుడ్ డెలిగేషన్ ఆంధ్ర సిఎమ్ ను ఏం కోరబోతోంది? హైదరాబాద్ లో మాదిరిగా విశాఖలో సినిమా జనాలకు ఇళ్ల స్థలాలు, స్టూడియోలు, ఇతర సంస్థలకు స్థలాలు ఇవ్వాలన్నది ఓ కోరిక. అయితే మరి ఈ ఇళ్ల స్థలాలు ఎవరికి ఇవ్వాలి? హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు పొందినవారికే మళ్లీ అక్కడ కూడా ఇవ్వాలా? అది వేరే పాయింట్. హైదరాబాద్ వదిలేసి విశాఖ వస్తామని చెప్పరు. ఇక్కడితో పాటు అక్కడ కూడా షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్ లు సమానంగా చేసుకుంటామని అంటారు.
కరోనా నేపథ్యంలో థియేటర్లకు కరెంటు బిల్లులు మాఫీ చేయాలని కోరతారు. కేంధ్ర ప్రభుత్వ సంస్థల్లో షూటింగ్ ల నిబంధనలు సడలించేలా చర్యలు తీసుకోవాలని కోరతారు.
రాష్ట్ర విభజనకు ముందు తెలుగు సినిమా పరిశ్రమ ఫండ్ ఎఫ్ డి సి దగ్గర పది కోట్లకు పైగా వుంది. ఇది రెండు రాష్ట్రాలకు పంపిణీ జరగాల్సి వుంది. అది కూడా ఈ సమయంలోనే చర్చకు వచ్చే అవకాశం వుంది.
అసలు ఎలా వెళ్లాలి?
ఇదిలా వుంటే ఇరవై మంది డెలిగేషన్ అమరావతికి ఎలా వెళ్లాలన్నది పెద్ద ప్రశ్న. ఆదిశేషగిరి రావు, విజయ్ చందర్, చిరంజీవి, సునీల్ నారంగ్ తండ్రి, మోహన్ బాబు ఇలా చాలా మంది 65 నుంచి 80 ఏళ్ల వాళ్లు వున్నారు. వీళ్లందరికీ కరోనా రిస్క్ ఎక్కువ. మరి వీళ్లంతా ఎలా వెళ్లడం ఎలా అన్న ఆలోచన కూడా వుంది. అందరూ కలిసి ఎవరి వాహనాల్లో వారు వెళ్లడమా? కలిసి వెళ్లడమా? అన్నది కూడా ఇంకా ఫైనల్ కాలేదు.