కేరాఫ్ కంచరపాలెం వెర్సెస్ ‘అ!’

కేరాఫ్ కంచరపాలెం.. ఈమధ్య కాలంలో బాగా నలుగుతున్న సినిమా. ఇంకా థియేటర్లలోకి రాని ఈ సినిమాపై ఓ వర్గం పనికట్టుకొని అదేపనిగా ప్రచారం చేస్తోంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే హిట్ అయిపోవడం గ్యారెంటీ…

కేరాఫ్ కంచరపాలెం.. ఈమధ్య కాలంలో బాగా నలుగుతున్న సినిమా. ఇంకా థియేటర్లలోకి రాని ఈ సినిమాపై ఓ వర్గం పనికట్టుకొని అదేపనిగా ప్రచారం చేస్తోంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే హిట్ అయిపోవడం గ్యారెంటీ అంటూ తెగ ఊదరగొడుతోంది. 

చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ బాబు తీసుకున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమా సందడి ముగిసిన తర్వాత థియేటర్లలోకి వచ్చేది ఈ సినిమానే. రీసెంట్ గా మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే రానా ఈ సినిమాకు ఎక్స్ క్లూజివ్ గా ప్రచారం చేయబోతున్నాడు.

అయితే కంటెంట్ విషయానికొస్తే నిజంగా ఈ సినిమాకు అంత విషయం ఉందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా వచ్చిన 'అ!' అనే సినిమాకు కేరాఫ్ కంచరపాలెం సినిమాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెబుతున్నారు కొంతమంది. 'అ!' సినిమాలో ఎలాగైతే హీరోయిన్ జీవితాన్ని వివిధ దశల్లో, వివిధ పాత్రల్లో చూపించారో.. సరిగ్గా అదే ఎత్తుగడ కేరాఫ్ కంచరపాలెం సినిమాలో కూడా కనిపిస్తుందట.

'అ!' సినిమాలో అభూత కల్పనలు, ఊహకు అందని విషయాలు ఎక్కువగా ఉన్నాయి. కేరాఫ్ కంచరపాలెంలో మాత్రం రియలిస్టిక్ కథల్ని తీసుకొని దాన్ని హీరో పాత్రకు అన్వయించారట. హీరోనే ఇందులో నాలుగు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట. అసలు హీరో ఎవరనే విషయం కూడా క్లయిమాక్స్ లో తెలుస్తుందట. రిలీజ్ కు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ చిన్న సినిమా, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఏమౌతుందో చూడాలి.