సినిమా రంగం ఆరంభంలో పరభాషా చిత్రాలను చూసి కథలు తయారుచేసుకునేవారు. తరువాత తరువాత నవలలను పట్టుకుని సినిమాలు చేసేవారు. ఆ తరువాత రీమేక్ లు వచ్చాయి. ఇప్పుడంతా డీవీడీలు, నెట్ ఫ్లిక్స్ లు, కొరియన్ సినిమాలు. చూసేయడం, అందులో పాయింట్ తీసుకుని, మన స్టయిల్ పాయింట్ మిక్స్ చేసి, కొత్త కాక్ టైల్ తయారుచేయడం. అయితే సమస్య ఏమిటంటే ఒకే డీవీడీ లేదా కొరియన్ సినిమా చూసి ఇద్దరు ముగ్గురు ఇన్ స్పయిర్ అయిపోతే, ఒకటే లైన్ తో సినిమాల మీద సినిమాలు వచ్చేస్తాయి.
ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసలు నిజమైతే, నిర్మాణంలో వున్న మూడు సినిమాలకు ఒకటే లైన్ ఆధారం అని తెలుస్తోంది. నాని-గౌతమ్ తిన్ననూరి (మళ్లీరావా) కాంబినేషన్ లో తయారవుతున్న జెర్సీ, విజయ్ దేవరకొండ-భరత్ కమ్మ కాంబినేషన్ లో ప్రారంభమైన డియర్ కామ్రేడ్, నాగ్ చైతన్య-శివనిర్వాణ కాంబినేషన్ లో ప్రారంభం కాబోయే సినిమా. ఈ మూడింటికి క్రికెట్ తో టచ్ వుంటుదని తెలుస్తోంది.
నాని జెర్సీ సినిమా ఇప్పటికే క్రికెట్ బ్యాక్ డ్రాప్ అని చెప్పేసారు. ఇక మిగిలిన రెండింటి సంగతి తెలియాలి. చైతన్య సినిమాలో పెళ్లికి ముందు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా క్రికెట్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ లో కాలేజీలో రాజకీయాలతో పాటు, క్రికెట్ వ్యవహారాలు వుంటాయని వినికిడి. మొత్తానికి ఈ మూడింటికి ఎక్క…డో… ఏదో ఇన్సిపిరేషన్ దొరికింది అనుకోవాలి.
కానీ ఎవరి సినిమా ముందువస్తే దానికే కిక్కు వుంటుంది. ఆ విషయంలో డియర్ కామ్రేడ్ కే ఎక్కువ చాన్స్ వుంది. ఎందుకంటే చైతన్య సినిమా ఆగస్టు 1న స్టార్ట్ అవుతుంది. నాని సినిమా సెట్ మీదకు వెళ్లడానికి టైమ్ పడుతుంది. కానీ విజయ్ దేవరకొండ-భరత్ కమ్మ సినిమా ముందుకు రెడీ అయిపోయే అవకాశం వుంది.