చైతన్యకో పెద్ద డైరెక్టర్‌ కావలెను

'రారండోయ్‌ వేడుక చూద్దాం'తో నాగ చైతన్యకి సోలోగా కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ వచ్చింది. ఈ చిత్రంతో అతను పాతిక కోట్ల షేర్‌ క్లబ్‌లో స్థానం దక్కించుకున్నాడు. చైతన్య చివరి మూడు చిత్రాల్లో ప్రేమమ్‌, రారండోయ్‌…

'రారండోయ్‌ వేడుక చూద్దాం'తో నాగ చైతన్యకి సోలోగా కెరీర్‌ బెస్ట్‌ హిట్‌ వచ్చింది. ఈ చిత్రంతో అతను పాతిక కోట్ల షేర్‌ క్లబ్‌లో స్థానం దక్కించుకున్నాడు. చైతన్య చివరి మూడు చిత్రాల్లో ప్రేమమ్‌, రారండోయ్‌ విజయం సాధించాయి కానీ అతను కోరుకుంటోన్న భారీ బ్లాక్‌బస్టర్‌ మాత్రం ఇంకా పెండింగ్‌లోనే వుంది.

ప్రేమకథా చిత్రాలతో సక్సెస్‌ అవుతోన్న నాగచైతన్య రేంజ్‌ ఒక స్థాయికి పరిమితం అయిపోయింది. 'సోగ్గాడే చిన్నినాయనా' తరహా మ్యాజిక్‌ వర్కవుట్‌ అవుతుందని నాగార్జున ఆశించినా కానీ 'రారండోయ్‌ వేడుక చూద్దాం' ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.

దీంతో చైతన్యని పెద్ద లీగ్‌లో చేర్చడానికి స్టార్‌ డైరెక్టర్‌ వుండాల్సిందేనని నాగార్జున భావిస్తున్నారు.

అయితే నాగచైతన్యతో చేసే స్టార్‌ డైరెక్టర్‌ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? అందరు పెద్ద దర్శకులకి కనీసం మూడు సినిమాలు క్యూలో వున్నాయి. చేసిన స్టార్‌ హీరోలే మళ్లీ మళ్లీ చేయడానికి దర్శకులపై ప్రెజర్‌ పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో పెద్ద స్టార్స్‌ని వదిలేసి నాగచైతన్య కోసం తీరిక చేసుకునేదెవరు? నాగార్జున ఒక కళ్లు చెదిరే ఆఫర్‌తో ఎవరైనా పెద్ద డైరెక్టర్‌ని ఆకర్షిస్తే చైతన్య కోరిక నెరవేరుతుందేమో.