కాస్త గ్యాప్ తరువాత హీరో గోపీచంద్ చేస్తున్న సినిమా చాణక్య. టైటిల్ కు సినిమాకు ఏం సంబంధమో ట్రయిలర్ లో అయితే రివీల్ చేయలేదు. సినిమాలో హీరో పేరు అయితే ఇదికాదని తెలుస్తూనే వుంది. బ్యాంక్ ఉద్యోగిగా వుంటూ తెరవెనుక 'రా' ఏజెంట్ గా పని చేసే వ్యక్తిగా గోపీచంద్ నటిస్తున్నట్లు అర్థం అవుతోంది.
కథను దాచడానికి పెద్దగా ప్రయత్నించలేదు. బ్యాంక్ లో పని చేసే హీరో, కాస్త సరదాగా వుండే హీరోయిన్, పక్కన కమెడియన్, ఉన్నట్లుండి బ్యాంక్ ఉద్యోగం వదిలి అసలు జాబ్ లోకి హీరో జంప్ చేయడం, పాకిస్థాన్ కు వెళ్లి అనుకున్నది సాధించుకు రావడం, ఒక పక్క విలన్, మరోపక్క రా సంస్థతో సంబంధాలు తెగిపోవడం, ఇవన్నీ దాటి హీరో ఎలా నెగ్గుకువచ్చాడు అన్నది కథగా ట్రయిలర్ చెబుతోంది.
హీరోయిన్ గా మెహరీన్ వుంది కానీ, ఒకసారి యాక్షన్ స్టోరీలోకి దిగిన తరువాత ఆమె పాత్ర ఏమిటన్నది మాత్రం ట్రయిలర్ లో లేదు. ట్రయిలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్ లో, హీరో, విలన్ ల సవాళ్లు, ప్రతి సవాళ్లే వున్నాయి. అయితే ఎక్స్ టార్డినరీ సీన్లు కానీ, కొత్త ప్రేమ్ లు కానీ, సూపర్ అనిపించే కొత్త విజువల్స్ కానీ కనిపించలేదు.
గోపీచంద్ కూడా ఎప్పటిలాగే రొటీన్ గానే వున్నాడు. సినిమాటోగ్రఫీ యాక్షన్ సినిమాకు తగినట్లే వుంది. మరి టోటల్ గా సినిమా వస్తే తప్ప, ఏ మేరకు కొత్తదనం వుంటుందో తెలియదు. దసరాకు విడుదల చేస్తున్న ఈ సినిమాకు దర్శకుడు తిరు, నిర్మాత ఎకె ఎంటర్ టైన్ మెంట్స్.