చంద్రబాబు మారిన మనిషా.? మర మనిషా.?

'నేను మారిపోయాను..' అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక్కసారి కాదు.. ఒకటికి పదిసార్లు కాదు.. ఒకటికి వంద సార్లు కాదు.. ఒకటికి వెయ్యిసార్లు చెప్పారు, చెబుతూనే వున్నారు. కానీ, ఆయన మారరు.…

'నేను మారిపోయాను..' అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక్కసారి కాదు.. ఒకటికి పదిసార్లు కాదు.. ఒకటికి వంద సార్లు కాదు.. ఒకటికి వెయ్యిసార్లు చెప్పారు, చెబుతూనే వున్నారు. కానీ, ఆయన మారరు. మారరుగాక మారరు. ఆ విషయం ఎన్నిసార్లు చెప్పుకున్నా అంతే. కానీ, చంద్రబాబు మారారట. అలా చంద్రబాబుని మార్చింది ఎవరో కాదు, ఓ పత్రికాధినేత. అవును, ఆ పత్రికాధినేత ఇచ్చిన సూచనల్ని, సలహాల్ని చంద్రబాబు పాటిస్తానని ప్రకటించారట. 

ఏ విషయంలో.? అనడక్కండి. అదంతే. అయినా, చంద్రబాబు చెప్పినట్లు ఆ పత్రికాధినేత నడుస్తారా.? ఆ పత్రికాధినేత చెప్పినట్లు చంద్రబాబు నడుచుకుంటారా.? ఈ పాయింట్‌ ఇక్కడ కీలకం. ఎందుకంటే, చంద్రబాబు కనుసన్నల్లోనే ఆ రెండు పత్రికలు (సారీ న్యూస్‌ ఛానళ్ళతో కలుసుకుంటే ఆ రెండు మీడియా సంస్థలూ అనక తప్పదు) పనిచేస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. 

2014 ఎన్నికల్లో ఆ రెండు పత్రికలూ చంద్రబాబుని మోసెయ్యడం కూడా ఎంతో కొంత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవడానికి కారణమే. ఆ మాటకొస్తే, తెలుగుదేశం పార్టీకి అన్ని వేళలా ఆ రెండు మీడియా సంస్థలూ వెన్నుదన్నుగా వుంటాయనుకోండి.. అది వేరే విషయం. అప్పుడప్పుడూ 'ఉచిత సలహాల్ని' కూడా ఆ రెండు మీడియా సంస్థలూ చంద్రబాబుకి ఇవ్వడం, చంద్రబాబు వాటిని పాటించినట్లు 'నటించడం' మామూలే. 

'అదిగో చంద్రబాబు మారారు.. ఇది మా క్రెడిట్‌..' అని చెప్పుకోడానికి ఆ రెండు మీడియా సంస్థల్లో ఒకటి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. పార్టీ కోసం కష్టపడాలనీ, పార్టీనీ ప్రభుత్వాన్నీ కలుపుకుపోయేలా నేతలు వ్యవహరించాలనీ చంద్రబాబుకి ఆ మీడియా సంస్థ అధినేత సూచించారట. దాన్ని చంద్రబాబు తు.చ. తప్పకుండా పాటించడానికి ఒప్పుకున్నారట. అవును మరి, చంద్రబాబు ఇప్పుడే కొత్తగా రాజకీయాలు మొదలెట్టారు మరి. 

ఏతావాతా చెప్పేదేంటంటే, సదరు పత్రికాధినేత చంద్రబాబుకి తాను షాడో సీఎం అనుకుంటున్నట్టున్నారు. ఏమో, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆలోచన ఏమన్నా ఆయనకి వుందేమో.! ఏమో, గుర్రం ఎగరావచ్చు.!