కొత్త సినిమాలు వచ్చినపుడు ఆ సినిమా హీరోలు, డైరక్టర్ల పాత సినిమాలు టీవీలో వేసే కార్యక్రమం ఒకటి వుంటుంది. దీని వెనుక కొత్త సినిమా యూనిట్ లాబీయింగ్ వుంటుంది అన్నది బహిరంగ రహస్యం. ఒక్కోసారి చానెళ్లు కూడా ఆసక్తిగా ఆ పనికి పూనుకుంటాయి.
అయితే అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా చానెళ్లలో వేస్తున్న పవన్ సినిమాలు చూస్తుంటే ఈ చానెళ్లు పవన్ సినిమాను చూడమని చెబుతున్నాయా? లేక పవన్ ఫ్లాప్ సినిమాలు వరుస పెట్టి గుర్తు చేస్తున్నాయా? అన్న అనుమానం కలుగుతోంది.
పవన్ నటించిన వీర ఫ్లాప్ సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్, జానీ లాంటివి టీవీల్లో వేస్తున్నారు. ఓ చానెల్ మరో అడుగు ముందుకు వేసి పవన్ తొలి సినిమా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాను కూడా గుర్తు చేసింది.
ఈ విధంగా చానెళ్లు రెండు పనులు చేస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ అజ్ఞాతవాసి జోలికి వెళ్లకుండా ఇంట్లో చానెళ్లలో తమ హీరో సినిమాలు చూసుకునేలా చేస్తున్నాయి. లేదా అంటే మామూలు జనాలకు పవన్ ఫ్లాప్ సినిమాలు గుర్తు చేసి, అజ్ఞాతవాసికి దూరంగా వుంచే పని చేస్తున్నాయి అనుకోవాలి.
మొత్తం మీద చానెళ్లు పవన్ సినిమాకు మేలు చేయబోయి, కీడు చేస్తున్నాయేమో అనుకోవాలి.