ఈసారి సంక్రాంతి ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ప్రియులకు జోష్ లేకుండా చేసింది. ఎ సెంటర్, బి, సి సెంటర్లు అని తేడా లేకుండా, థియేటర్ల దగ్గర కుమ్మేసుకునేంత సీన్ వుండే సినిమా ఈసారి రాలేదు. లాస్ట్ ఇయర్ అలా కాదు. ఇటు బాలయ్య శాతకర్ణి, అటు మెగాస్టార్ ఖైదీ 150ఇంకో పక్క జనాలను ఉర్రూత లూగించాయి.
ఈసారి కూడా అలాంటి పోటీ వుంటుదని అందరూ అనుకున్నారు. పవన్, మహేష్ పోటా పోటీగా రంగంలోకి వస్తారనుకున్నారు. వీళ్లకు పోటీగా అనుష్క భాగమతి వస్తుందని అంచనా వేసారు. బాలయ్య జై సింహా ముందే ఫిక్సయింది. ఇన్ని సినిమాలతో సంక్రాంతి వేళకే చలి ఎగిరిపోయి, వేడి పుడుతుందనుకున్నారు.
కానీ మహేష్ వెనక్కు వెళ్లాడు. పవన్ నిరాశ పర్చాడు. అనుకోకుండా సూర్య లైన్ లోకి వచ్చాడు. భాగమతి రాకుండా సూర్య అడ్డం పడ్డాడు. ఎందుకంటే భాగమతిని తమిళనాట కూడా విడుదల చేయాలి.
సంక్రాంతికి సూర్య సినిమా వుంటే భాగమతికి స్క్రీన్ లు దొరకవు. పైగా యువికి సూర్య నిర్మాతలతో ఆబ్లిగేషన్. దాంతో భాగమతిని పది రోజులు వెనక్కు జరిపారు. అంతే కాక, భాగమతి పంపిణీలో భాగం, నిర్మాణ సంస్థతో సంబంధాలు వున్న దిల్ రాజు వద్దు కాక వద్దని చెప్పారని తెలుస్తోంది. దాంతో వెనక్కు పెట్టక తప్పలేదు.
అదే కనుక భాగమతి సంక్రాంతికి వచ్చి వుంటే అందరి సినిమా అయివుండేది నిస్సందేహంగా. సినిమా ఎలావున్నా కూడా హర్రర్ జోనర్, అనుష్క, భారీతనం అన్నీ కలిసి సినిమాకు మాంచి బజ్ తెచ్చి సంక్రాంతి సినిమాగా మార్చి వుండేవి.