అన్నీ అనుకున్నట్టు జరిగితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమా జనవరి మూడోవారం నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మేరకు 2-3 ముహూర్తాలు చూశారు. రామ్ చరణ్, చిరంజీవి కలిసి చర్చించుకొని వీటిలో ఓ తేదీని త్వరలోనే ఫిక్స్ చేయబోతున్నారు.
ఓ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవడం చరణ్ కు అలవాటు. ఈసారి మాత్రం అలాంటి నియమాలు పెట్టుకోలేదు. సుకుమార్ తో చేస్తున్న రంగస్థలం సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉంటుండగానే బోయపాటి సినిమాను పట్టాలపైకి తీసుకొస్తున్నాడు.
మరోవైపు ఈ మూవీకి సంబంధించి 2ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఒకటి స్టోరీలైన్. బోయపాటి, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట చరణ్. ద్విపాత్రాభినయం మాత్రం కాదని తెలుస్తోంది.
ఇక రెండో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారట. మొన్నటివరకు అను ఎమ్మాన్యుయేల్ పేరు వినిపించింది. ఇప్పుడామె స్థానంలో కైరా పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మహేష్ సరసన 'భరత్ అనే నేను' సినిమాలో నటిస్తోంది.