చరణ్ వేస్తున్న తప్పటుడుగులు

ఎంతయినా అనుభవం అనుభవమే. దాని లెక్క వేరుగా వుంటుంది. రామ్ చరణ్ నిర్మాతగా మారారు కానీ, ఇంకా అనుభవం రావాలిగా. ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ సక్సెస్ మీట్ విషయంలో చరణ్ ఇలాగే…

ఎంతయినా అనుభవం అనుభవమే. దాని లెక్క వేరుగా వుంటుంది. రామ్ చరణ్ నిర్మాతగా మారారు కానీ, ఇంకా అనుభవం రావాలిగా. ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ సక్సెస్ మీట్ విషయంలో చరణ్ ఇలాగే తప్పటడుగువేసారు. అసలు ఎక్కడ ప్రీ సక్సెస్ మీట్ జరుగుతుందో, దానికి అడ్డంకులు ఏమైనా వచ్చే అవకాశం వుందో లేదో, అన్నీ చూసుకుని, అప్పడు ఆయన పెదవి విప్పాలి. అంతవరకు కావాలంటే ఆయన జనాలు ఎవరైనా, ఎన్నయినా ఫీలర్లు వదలవచ్చు. కానీ యూనిట్ తరపున లేదా, నిర్మాతగా రామ్ చరణ్ టక్కున హఢావుడి పడకూడదు. విజయవాడ సభ గురించి ఏకంగా రామ్ చరణ్ నే ఓ విడియో ఇన్విటేషన్ వదిలేసారు. ఇప్పుడేమయింది. వెన్యూ మారిపోయింది. డేట్ మారిపోయింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో విడియో వదలాలేమో?

ఇదే అల్లు అరవింద్ వ్యవహారం చూడండి..ఆయన సినిమాలు, ఫంక్షన్లు గురించి ఎవరికి వాళ్లు రాసుకోవడమే కానీ, ఆయన అంతట ఆయన అంత సులువుగా నోరు విప్పరు. చాలా సైలెంట్ గా పని కానిస్తారు. ఒకసారి వేదిక మీదకు వచ్చాక మాత్రమే ఆయన మాట్లాడతారు. ఈ విషయంలో చరణ్ తన మామయ్య దగ్గర కాస్త నేర్చుకోవాలేమో? ఎందుకంటే నిర్మాతగా కంటిన్యూ కావాలని, కొణిదెల సంస్థను మంచి ప్రొడక్షన్ హవుస్ గా తీర్చి దిద్దాలని ఆయన అనుకుంటున్నారని వార్తలు వినవస్తున్నాయి. అందువల్ల ఇప్పటి నుంచీ జాగ్రత్త పడడం అవసరం

సోషల్ మీడియాతో సరి

చరణ్ బ్యాచ్ ఎంత సేపూ సోషల్ మీడియాను, ట్విట్టర్ ను పట్టుకుని వేలాడుతోంది. విజయవాడలో 4న మీట్ అని ప్రింట్ మీడియాలో ప్రకటించారు. కానీ ఇంతవరకు అదే ప్రింట్ మీడియాలో మార్పు వైనం ప్రకటించలేదు. ఫంక్షన్ నిర్వహించే సంస్థ మార్పును గురించి సోషల్ మీడియలో ప్రకటించింది కానీ, ప్రింట్ ద్వారా జనాలకు తెలియలేదు. దీంతో కింది స్థాయి ఫ్యాన్స్ ఇంకా అయోమయంలోనే వున్నారు.

ట్రయిలర్ ఎక్కడ

ఓ పెద్ద సినిమా విడుదల జస్ట్ పది రోజుల్లోకి వచ్చేసింది ఇంతవరకు ట్రయిలర్ లేదు. మాస్ జనం ఏమనుకుంటున్నారు? ఇది చిరు 150వ సినిమా. మాస్ మసాలా సినిమా అనుకుంటున్నారు. అంతేకానీ ఇదో కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అన్నది కింది లెవెల్ అభిమానులకు, ప్రేక్షకులకు క్లియర్ గా తెలియదు. పక్కా మాస్ మసాల సినిమా అనే విధంగానే ప్రెజెంట్ చేస్తూవస్తున్నారు ఇంతవరకు. కానీ ఇందులో సోషల్ మెసేజ్ వగైరా వుంటాయన్నది తెలియదు.

చరణ్ ను కలవలేరా?

ఇటు అభిమానుల్లో కాస్త కీలకమైన వారైనా, మరెవరికైనా చరణ్ అందుబాటులో వుండడం లేదన్న విమర్శలు కూడా వున్నాయి. అసలు ఆ మాటకు వస్తే నిర్మాతలకు కూడా చరణ్ తో కలిసే అవకాశం తక్కువని, ఎవరైనా సరే, మేనేజర్ ప్రవీణ్ ద్వారానే వర్తమానం అందించాల్సిందే తప్ప,మరో మార్గం వుండదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంటుంది. అక్కడ నుంచి నో వస్తే నో, ఎస్ వస్తే, ఎస్ అని అనుకోవాలి తప్ప, చరణ్ నో అన్నారా, ఎస్ అన్నారా అన్నది మాత్రం తెలియదు. ఇలాంటి వైనాల వల్ల చాలా మంది చరణ్ కు దూరమై, మిగిలిన మెగా హీరోలకు దగ్గరవుతున్నారు. ఈవిషయాన్ని కూడా ఆయన గమనించుకోవాలి.