'ఖైదీ నెంబర్ 150' సినిమా పట్టాలెక్కడానికి ముందు ఎంత గందరగోళం చెలరేగిందో అందరికీ తెల్సిన విషయమే. హీరోగా రీ-ఎంట్రీ ఇవ్వడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని భావించిన చిరంజీవి, ఇందుకోసం చాలా తంటాలే పడ్డారు. ముందు పూరి జగన్నాథ్‌తో సినిమాని పట్టాలెక్కాద్దామనుకున్నారు.. అయితే అది 'ఖైదీ' కాదనుకోండి.. అది వేరే విషయం. అంతకు ముందు వినాయక్ పేరు తెరపైకొచ్చింది. అదీ 'ఖైదీ' సినిమా కాదు. వినాయక్‌ని కాదని పూరిని పిలిచి, ఆ తర్వాత పూరిని పక్కన పెట్టి, వినాయక్‌ని ముందుకు తీసుకొచ్చి, ఎలాగైతేనేం 'ఖైదీ నెంబర్ 150' సినిమాని పట్టాలెక్కించారు చిరంజీవి.
ఇక, త్వరలో సినిమా విడుదల కానుందనగా మళ్ళీ గందరగోళం. ఆడియో విడుదల వేడుక కాస్తా గందరగోళం నడుమ అటకెక్కేసింది. విజయవాడ – గుంటూరు పరిసరాల్లో ఆడియో విడుదల వేడుక కోసం పలు చోట్ల పరిశీలించి, పరిశోధించి చేతులెత్తేసిన విషయం విదితమే. ఇప్పుడేమో, ప్రీ రిలీజ్ ఫంక్షన్ వంతు. విజయవాడలో జరుగుతుందని నిర్మాత రామ్‌చరణ్ అనౌన్స్ చేస్తే, అది కాస్తా ఇప్పుడు సస్పెన్స్‌లో పడింది. అభిమానులేమో, తమ అభిమాన హీరో సినిమాకి ఇవేం పాట్లు.? అంటూ అసహనంతో రగిలిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 'ఖైదీ నెంబర్ 150' సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంటూ అభిమానులు గుస్సా అవుతుండడంతో కొత్త వివాదం తెరపైకొచ్చినట్లయ్యింది. చంద్రబాబుకి బాలకృష్ణ హుకూం జారీ చేశారనీ, 'గౌతమి పుత్ర శాతకర్ణి' కోసం బాలకృష్ణ స్వయంగా ఎమ్మెల్యే హోదాలో తన పవర్‌ని ఉపయోగించి, 'ఖైదీ'కి అడ్డంకులు సృష్టిస్తున్నారనే కోణంలో కొంత ప్రచారమైతే గాసిప్స్ రూపంలో షురూ అయ్యింది. ఇలాంటి వాదనల్లో పస ఎంతుందన్నది వేరే విషయం.
మరోపక్క, పవన్‌కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ మీటింగ్‌కి ప్లాన్ చేసిన విషయం విదితమే. జనవరి 3న ఆ మీటింగ్ జరగనున్న సంగతి తెల్సిందే. ఆ పనుల్లో పవన్ బిజీగా వున్నారిప్పుడు. కాగా, ’ఖైదీ‘ వేడుకకి పవన్ కళ్యాణ్ హాజరయ్యేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చరణ్, ఆ విషయంలో స్పష్టత లేక ఈ గందరగోళం కొనసాగిస్తున్నారేమో అన్నది ఇంకో వాదన. ఏదిఏమైనా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఖైదీ' సినిమాకి ఈ వాయిదాలు, గందరగోళం ఏమాత్రం శుభూసూచకంగా అవేని అభిమానులు చెబుతున్న మాటల్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం. ఈ కన్ఫ్యూజన్పై నిర్మాత రామ్‌చరణ్ క్లారిటీ ఇస్తాడా.? వేచి చూడాల్సిందే.