సినిమా ఆడియో వేడుకలంటే యాంకర్ పాపలదే హంగామా అంతా. సంప్రదాయంగా కనిపిస్తూ అల్లరి చేయాలంటే సుమ, లేదంటే ఝాన్సీ. అరుపులూ కేకలూ తప్పదనుకొంటే ఉదయభాను. గ్లామర్ కావాలంటే అనసూయ. ఇలా డిమాండ్ ని బట్టి భామలు దర్శనమిస్తుంటారు.
అయితే జ్యొతిలక్ష్మి ఆడియో వేడుక మాత్రం కాస్త వెరైటీగా చేయాలనుకొంటున్నాడు పూరి. అందుకే యాంకరింగ్ బాధ్యతని ఛార్మికి అప్పగించేశారట. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తోంది ఛార్మి.
ఆ లెక్కన.. ఏదో ఆడియో ఫంక్షన్ టైమ్ కి వచ్చి, దర్జాగా మైకు పట్టుకొని నాలుగు మాటలు మాట్లాడేసి, వీలైతే ఓ స్టెప్పేసి వెళ్లిపోవాలి. కానీ.. ఛార్మి మాత్రం యాంకరింగు పాత్రని భుజాలనెత్తుకొంది. ఈనెల 4న ఆడియో వేడుక జరగబోతోంది. మరి ఈ కార్యక్రమాన్ని ఛార్మి ఎంత రసవత్తరంగా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.