ఉన్నట్లుండి కోర్టు మెట్లు ఎక్కింది హీరోయిన్ చార్మి. ఉభయ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో పూరిజగన్నాధ్, తరువాత చార్మి కీలకంగా వున్నారు. పైగా చార్మి కూడా పూరికి సన్నిహితురాలు కావడం విశేషం. 27న చార్మి విచారణకు హాజరవుతారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, చటుక్కున ఆమె హైకోర్టు తలుపు తట్టారు.
సిట్ విచారణ చట్టబద్దంగా జరగడం లేదని, అలాగే బలవంతంగా రకరకాల శాంపిల్స్ తీసుకుంటున్నారని, ఇంకా పలు అభ్యంతరాలతో చార్మి కోర్టు కెక్కినట్లు తెలుస్తోంది. చార్మి పూర్తి పిటిషన్ వివరాలు ఇంకా తెలియకపోయినా, డ్రగ్స్ కేసు పూర్వా పరాలను పరిశీలిస్తున్నవారు మాత్రణ చార్మి రాంగ్ స్టెప్ వేసిందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి దాకా పూరి, సుబ్బరాజు, తరుణ్, శ్యామ్ కే నాయుడు, నవదీప్ ఇలా అందరూ విచారణకు హాజరయ్యారు. శాంపిల్స్ ఇవ్వండి అంటే ఇస్తామనే చెప్పి, ఇచ్చి వచ్చారు. మరి వీరికి లేని అభ్యంతరం చార్మికి ఏమిటి? ఒక వేళ చార్మి అభ్యర్థన మేరకు ఇప్పుడు శాంపిల్స్ తీసుకోవద్దని కోర్టు ఏమైనా ఆదేశిస్తుందా? కానీ ఇప్పటికే ఎక్సయిజ్ డైరక్టర్, కమిషనర్ స్పష్టం చేసారు. ఇష్టం లేకుండా తాము తీసుకోమని. రేపు కోర్టులోనూ అదే చెబుతారు. ఇంకేమిటి సమస్య?
దర్యాప్తు అధికారాలు, సాగుతున్న తీరు మీద ఈరోజు పూర్తి వివరణ ఇచ్చింది ఎక్సయిజ్ శాఖ. అదే రేపు కోర్టులో ఆ శాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనగా వుండోచ్చు. అప్పుడు ఏమవుతుంది అన్నది చూడాలి. ఒక వేళ కోర్టు కనుక, చార్మి విచారణను ఎదుర్కోవలసిందే అని అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?
నిజానికి ఇప్పటి దాకా విచారణ ఎదుర్కొన్న వారంతా సిట్ విచారణ పై ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. విచారణకు హాజరయిన వారు ఏమైనా విమర్శ చేస్తే ఓ అర్థం వుంటుంది. కానీ వాళ్లంతా తాము పూర్తిగా సహకరించామని, తమను గౌరవంగా చూసారని, కావాలంటే మళ్లీ వెళ్తామని అంటున్నారు.
కానీ చార్మి తనకు న్యాయవాది తోడు కావాలని కోరుతున్నారు. అంటే విచారణలో ఏదైనా అభ్యంతరాలు వున్నాయన్న విషయం చార్మి దృష్టికి వచ్చిందా? విచారణ కు హాజరయిన వాళ్లు బయటకు చెప్పలేనివి, చార్మికీ ఏమైనా చెప్పారా? అస్న సందేహాలు ఈ సందర్భంలో కలుగుతున్నాయి.
మొత్తం మీద చార్మి ఇప్పుడు డ్రగ్స్ కేసును కొత్త మలుపు తిప్పినట్లే. చార్మి పిటిషన్ తరువాతే ఎక్సయిజ్ శాఖ అన్ని వివరాలతో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు, కోర్టు నిర్ణయం తరువాత మరింత పకడ్బందీగా ముందుకు వెళ్లే అవకాశం వుంది. పైగా ఇప్పటి దాకా ఏ మూలో, ఏ మాత్రమో సాఫ్ట్ కార్నర్ వున్నా, అది ఇప్పుడు పూర్తిగా మాయమయ్యే ప్రమాదం వుంది.
మొత్తం మీద చార్మి పిటిషన్ పై హై కోర్టు నిర్ణయం డ్రగ్స్ కేసును ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.