Advertisement


Home > Movies - Movie Gossip
చెప్పను బ్రదర్‌.. చెప్పలేను ప్లీజ్‌.!

అయ్యోపాపం.. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి ఎంత కష్టమొచ్చింది.? రాజకీయాల గురించి మాట్లాడను మొర్రో.. అంటున్నా, ఆయన్ని అభిమానులు వదలడంలేదాయె. 'రాజకీయాలపై క్లారిటీ ఇవ్వాల్సిందే..' అంటూ అభిమానులు తెస్తున్న ఒత్తిడితో రజనీకాంత్‌ పడ్తున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. గట్టిగా చెబితే అభిమానులు గుస్సా అవుతారు.. చెప్పకపోతే గుచ్చి గుచ్చి అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారు.! పాపం రజనీకాంత్‌.. ఈ కష్టం పగవాడిక్కూడా వద్దు.! 

అభిమానులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న రజనీకాంత్‌, 'దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానేమో.. రాజకీయాల్లోకి వస్తే మాత్రం స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన అందిస్తాను..' అంటూ తొలి రోజు వీరావేశంతో మాట్లాడేశారుగానీ, 'రాజకీయాల్లోకి వచ్చేదెప్పుడు.?' అన్న ప్రశ్నకి మాత్రం ఆయన అభిమానులు సంతృప్తి చెందేలా సమాధానమివ్వలేకపోతున్నారు. 

ఈ రోజు రజనీకాంత్‌ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యిందట. 'రాజకీయాల గురించి మాట్లాడొద్దు.. మీరు అడిగితే, నేను సమాధానం చెప్పలేను..' అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసిన రజనీకాంత్‌, 'చెప్పను బ్రదర్‌.. చెప్పలేను బ్రదర్‌..' అంటూ కొంచెం కోపంతో కూడిన సమాధానమిచ్చారట. 'సినిమాల గురించి అడగండి, ఏమైనా చెబుతా..' అంటూ రజనీకాంత్‌, అభిమానులతో చెబుతున్నా, అభిమానులకు కావాల్సింది 'సినిమా సంగతులు' మాత్రం కాదు కాబట్టి, ఈ మేటర్‌కి 'కంక్లూజన్‌' లేకుండా పోతోంది. మీడియాని సైతం రజనీకాంత్‌, 'రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు ప్లీజ్‌..' అని వేడుకుంటున్నారు. 

అలా ఎలా కుదురుతుంది.? రాజకీయాలపై ఆసక్తి వుందంటారు, లేదంటారు. పదవిపై ఎవరికి ఆసక్తి వుండదని అమాయకంగా ప్రశ్నిస్తారు. తనకూ ఆశ వుందని చెబుతారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానంటారు. అదెప్పుడో మాత్రం చెప్పరు. కేవలం సినీ నటుడిగా వున్నాసరే, పొలిటికల్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన రోజులివి. అలాంటిది, తమిళ సూపర్‌ స్టార్‌, రాజకీయాల గురించి మాట్లాడొద్దని వేడుకుంటే మాత్రం మీడియా ఊరుకుంటుందా.? ఛాన్సే లేదు. 

నేడు కాకపోతే రేపయినా రజనీకాంత్‌, రాజకీయాలపై అభిమానులకు మీడియా సాక్షిగా సమాధానం చెప్పి తీరాల్సిందే.