దర్శకుడు త్రివిక్రమ్ మాటల్లో భలే చిత్రమైన ప్రయోగలు చేస్తుంటారు. అవే తరహా ప్రయోగాలు ఆయన సినిమాల పాటల్లో కూడా వినిపిస్తుంటాయి. గతంలో ఇలాంటివి చాలా చేసారు. లేటెస్ట్ గా అల వైకుంఠపురములో సినిమాలో ఓ పాటలో ఇలాంటి ప్రయోగాలే చేసారు. బన్నీ సినిమా అలవైకుంఠపురములో రెండో పాటను ఈరోజు విడుదల చేసారు.
రాములో రాముల.. నా ప్రాణం తీసిందిరో అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ ను డిఫరెంట్ గా వర్ణించారు రచయిత కాసర్ల శ్యామ్. చిల్డ్ బీర్ కు సిల్కు చీర కట్టినట్లు, బిర్యానీ పొట్టానికి బొట్టుపెట్టినట్లు హీరోయిన్ వుందీ అనే చమత్కారం త్రివిక్రమ్ సినిమా పాటల్లోనే వినిపించే వ్యవహారం. పువ్వుల అంగీ గుండీ పువ్వే పూయడం అనే ప్రయోగం కూడా బాగుంది.
మొత్తంమీద పాట ట్యూన్ క్యాచీగా వుంది. సర్రున హిట్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. లిరికల్ విడియోను మామూలుగా వదిలేయకుండా, దానికోసం ఓ సెట్, ఓ మ్యూజిక్ బ్యాండ్ వంటి వ్యవహారాలు చేయడం బాగానే వుంది. ఈ విడియోలో థమన్, శివమణి కూడా కనిపించారు. కానీ తొలిసారి పాట వినేటపుడు పాట వినాలా? విడియో చూడాలా? అన్న చిన్న కన్ఫ్యూజన్ తప్పదు.