మీనం మేషం లెక్కపెడుతూ కూర్చుంటే ముహుర్తాలు దాటిపోయాయి అని వెనకటికి సామెత. చైతన్య-వెంకటేష్ ల వెంకీమామ సినిమా పరిస్థితి అలాగేవుంది. సముద్ర కెరటాలు వెళ్లాక స్నానం చేసే అయిడియాలా వుంది వ్యవహారం. సోలో డేట్ కావాలి, అటు ఇటు వారం గ్యాప్ కావాలి. అప్పుడే కలెక్షన్లు కుమ్మేస్తాం అనే టైపులో డేట్ కోసం వెదుకుతూ కూర్చున్నారు.
ముఫై మూడు డేట్ లు ముందు పెట్టుకుని, లెక్కలు కడుతున్నారు. ఈలోగా రావాల్సిన సినిమాల డేట్ లు అన్నీ వరుసగా వచ్చేస్తున్నాయి. డిసెంబర్ 20న ఇప్పటికే మారుతి సినిమా ప్రతిరోజూ పండగ డేట్ వచ్చేసింది. సంక్రాంతికి అనుకుంటే 11,12, 15 డేట్ లు వరుసగా సినిమాలు అనౌన్స్ చేసేసారు. ఉత్తరాంధ్రలో వెంకీమామకు కొన్నిచోట్ల ఒక్క థియేటర్ కూడా దొరకని పరిస్థితి వుంది.
ఇక మిగిలిన ఆప్షన్లు డిసెంబర్ 6, 13 మాత్రమే. ఇంకే ఏ డేట్ కు వేసినా భయంకరమైన పోటీలో చిక్కుకోవాల్సిందే. అక్కడ కూడా ఇంకా భయపడుతున్నట్లే కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ఎక్కడ వస్తుందో అన్న ఆందోళనలో వెంకీమామ వున్నట్లు కనిపిస్తోంది.
సీనియర్ హీరో, యంగ్ హీరో, ఇద్దరు హీరోయిన్లు వున్న మల్టీస్టారర్ సినిమా ఇంతలా జంకడం ఏమిటో? సినిమాకు బడ్జెట్ ఎక్కువ కావడం, పాతిక కోట్లకు పైగా థియేటర్ల మీదే రికవరీ కావాల్సి వుండడం అన్నది, వెంకీమామ ముందు వెనుకలకు కారణం అవుతోంది.