చైతన్య హీరో గా తెరపైకి వచ్చి చాలా కాలం అయింది. అయినా మేనమామ సురేష్ బాబు ఇంతవరకు ఓ సినిమా కూడా చేయలేదు. అయితే ప్రేమమ్ తరువాత సురేష్ బ్యానర్ లో కొత్త దర్శకుడు కృష్ణ డైరక్షన్ లో ఒక సినిమా వుంటుందని వార్తలు వినవచ్చాయి. అంతలోనే అది ఆగిపోయిందని వదంతులు. ఇప్పుడు కొత్త వార్త ఏమిటంటే..తాను,చైతూ కలిసి స్వంతంగా కొత్త ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నామని, కృష్ణ డైరక్షన్ లో చైతూతో సినిమా చేస్తున్నామని రానా తన పుట్టిన రోజు స్పెషల్ గా ట్వీట్ చేసాడు.
కానీ ఈ వ్యవహారం అంతటి వెనుక ఒక గమ్మత్తయిన కుటుంబ వ్యవహారం వుందని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. కాస్త ఆసక్తికరమైన ఈ సంగతి ఏమిటంటే..చాన్నాళ్లంటే చాన్నాళ్ల క్రితం నాగార్జున ఆయన భార్య (సురేష్ సోదరి) విడిపోకముందరి కాలం. అప్పట్లో సురేష్ బాబు నాగార్జునతో చినబాబు అనే సినిమా తీసారు. 1988 నాటి మాట అది. అందులో అమల హీరోయిన్. మోహన్ గాంధీ డైరక్టర్. ఆ సినిమా పెద్ద గొప్పగా ఆడలేదు. అదే సమయంలో సురేష్ బ్యానర్ పైనే బ్రహ్మపుత్రుడు సినిమా తీసారు. అది బాగా ఆడింది.
ఆ టైమ్ లో సురేష్ సోదరి తన అన్నను కాస్త మెల్లగా నిలదీసినట్లు వినికిడి. మా ఆయనకు మంచి సినిమా తీసి పెట్టలేదు. మీ తమ్ముడు (తనకూ సోదరుడే)కి మాత్రం మంచి సినిమా తీసుకున్నావు అని. ఇప్పుడు అనుకోకుండా అదే పరిస్థితి ఎదురైంది. సురేష్ బాబు తన స్వీయ నిర్మాణంలో రానాతో సినిమా చేస్తున్నారు. తేజ దర్శకుడు. ఇదే టైమ్ లో చైతూతో సినిమా చేస్తే, రెండింటిలో దేనికైనా తేడా వస్తే, మళ్లీ ఇంట్లో వాళ్లతో తకరారు. ఎందుకొచ్చింది? ఇప్పుడు ఈ ప్రోబ్లమ్ అవసరమా? అని సురేష్ బాబు ఆ చైతూ ప్రాజెక్టును కాస్త వెనకగా తీద్దామని ఆపేసారట.
ఇప్పుడు అదే ప్రాజెక్టును రానా-చైతూ టేకప్ చేస్తున్నారు. రానా ఏంటీ..చైతూ ఏంటీ? వెనక వుండేది గాడ్ ఫాదర్ లాంటి సురేష్ బాబే కదా? అందుకే తనకు ఇబ్బంది లేకుండా సురేష్ బాబే ఈ ప్రాజెక్టును స్మూత్ గా రానా-చైతూల కోర్టులోకి తోసేసినట్లుంది. ఏది ఏమయినా వాళ్లే స్వంతంగా చేసుకున్నది కదా? ఎవరూ ఏమీ అనడానికి వుండదు. సురేష్ బాబుది మాస్టర్ మైండ్ ఏమయినా?