పెద్ద సంస్థలు చిన్న సినిమాలు నిర్మిస్తే వచ్చే అడ్వాంటేజీలు కొన్ని వుంటాయి. ఆ సంగతి చాలా మంది చిరకాలంగా చెబుతున్నా, అందరూ అంతగా పట్టించుకోలేదు. అశ్వనీదత్,అరవింద్ తదితరులు కలిసి అప్పట్లో పెళ్లి సందడి లాంటి చిన్న సినిమా నిర్మిస్తే సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సినిమా పరిశ్రమ కాస్త ఇబ్బందుల్లో వుంది. పెద్ద సినిమాలు జూదంగా మారిపోయాయి. ఎంత హడావుడి చేసినా కోటి రూపాయిలు మిగలడం కష్టమైపోతోంది.
కానీ అదే సరైన చిన్న సినిమా తీస్తే నాలుగైదుకోట్లు మిగులుతున్నాయి. బెల్లంకొండ సురేష్ బస్ స్టాప్ తో అలాగే కాస్త సంపాదించారు. తాజాగా సాయి కొర్రపాటి ఊహలుగుసగుసలాడే అనే చిన్న సినిమా తీస్తే ఫరవాలేదనిపించుకున్నారు. ఇక అల్లు అరవింద్ తన కుమారుడు శిరీష్ తో కొత్తజంట తీసి కనీసం మూడు నుంచి నాలుగు కొట్లు లాభం సంపాదించారు. ఇప్పుడు 14 రీల్స్ సంస్థ కూడా సందీప్ కిషన్ తో ఓ చిన్న సినిమా తీయాలని చూస్తోంది.
మిర్చి లాంటి పెద్ద సినిమా తీసిన యువి సంస్థ రన్ రాజా రన్ లాంటి మీడియం రేంజ్ సినిమా తీసి తొలి వారంలోనే లాభాలు కళ్ల చూస్తోంది. అందుకే ఇప్పుడు అల్లు అరవింద్ చిన్న సినిమాలకు వేరే విభాగం ప్రారంభించాలని చూస్తున్నారని వినికిడి. బి బ్యానర్ లేదా అలాంటి పేరుతో (బి అంటే బన్నీ కూడా) ఓ సంస్థను కూడా ప్రారంభించి, మంచి చిన్న ప్రాజెక్టులు తెచ్చేవారిని ప్రోత్సహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లవ్ లీ లాంటి మీడియం రేంజ్ సినిమా తీసిన బిఎ రాజు కూడా వరుసగా చిన్న సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఉయ్యాల జంపాల తరువాత రామ్ మోహన్ తరువాతి ప్రాజెక్టు లో కూడా నాగ్ పాలు పంచుకుంటున్నారు.
దీంతో దాదాపు అందరు పెద్ద నిర్మాతలు మీడియం, స్మాల్ రేంజ్ సినిమాల పట్ల దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ రేంజ్ సినిమాల ఖర్చు మూడు నుంచి అయిదు కోట్లు దాటదు. ఏ మాత్రం బాగున్నా శాటిలట్ లోనే మూడో వంతు ఖర్చు వచ్చేస్తుంది. మిగిలిన మొత్తం ఒకటి రెండు వారాల్లో రావడం పెద్ద కష్టం కాదు. దానికి తోడు పెద్ద సంస్థల ఇమేజ్, ప్లానింగ్ చిన్న సినిమాలకు పనికి వస్తుంది.
ఆ విధంగానైనా మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఆశిద్దాం.