ఆయన మెగాస్టార్ అయ్యాడన్నా, ఒక రాజకీయపార్టీని పెట్టే సాహసం చేశాడన్నా, పెట్టిన కొన్ని నెలల్లోనే 70లక్షల ఓట్లు తెచ్చుకున్నాడన్నా, ఆ తర్వాత కేంద్రమంత్రి అయ్యాడన్నా… తన వారసులుగా ఒకరు కాదు ఇద్దరూ కాదు వరుసపెట్టి హీరోలను తెలుగు తెరమీదకు వదులుతున్నాడన్నా… అంతెందుకు 60 ఏళ్ల వయసులో కూడా హీరోగా మరో సినిమా చేస్తున్నాడన్నా… ఇంకా ఎన్నో ఆయన సాధించిన విజయాలకు చిరంజీవిని స్వంత అన్నలా భావించిన అభిమానులే కారణం.
ఆయన్ను కొన్నేళ్లుగా తమ దైవంలా కొలుస్తున్న వారి ఆరాధనాభావమే కారణం. అలాంటి అభిమానుల్ని చిరంజీవి తూలనాడాడు. తీసిపారేసినట్టు మాట్లాడాడు. ఇంతకీ ఆ అభిమాని చేసిన పాపం కూడా ఏమీ లేదు. తన ఆరాధ్యదైవం లాంటి చిరుకి ఒకటికి రెండుసార్లు దండం పెట్టడమే.
బ్రూస్లీ ఆడియో సందర్భంగా చిరంజీవి తనను పలకరించడానికి వచ్చి దండం పెట్టిన అభిమానిపై మండిపడడం, స్టుపిడ్ ఫెలోస్ అంటూ తిట్టిపోయడం… రెండ్రోజుల క్రితం యూట్యూబ్ సాక్షిగా వేలాది మంది చూశారు. ఇంకా చూస్తున్నారు. కాని అదేంటో తెలుగు టివి చానెళ్లు ఈ ఉదంతాన్ని లైట్‌గా తీసుకున్నాయి.
ఒక అగ్రహీరో తన అభిమానులను అంతగా కించపరచడం అనే సంఘటన జరిగితే అది వీక్షకుల దృష్టికి తేవాల్సిన అవసరం లేదా? ఈ హీరోలు కూడా మామూలు మనుషులే నాయనా? వారిని దేవుళ్లుగానో, మీ ప్రాణ సమానులుగానో ఫీలైపోకండి. సినిమాలు చూడండి, ఆనందించండి అంతే కానీ మరీ అంత పిచ్చి పెంచుకోకండి వాళ్ల కోసం చొక్కాలు ప్యాంట్లు చించుకోకండి అని కొందరికైనా తెలిసొచ్చేలా చెప్పాల్సిన అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రం నుంచి పనిచేస్తున్న ఒక్క చానెల్ తప్ప మరే తెలుగు చానెల్ గాని, దినపత్రిక గాని దీనిని అంత ప్రాధాన్యం ఇచ్చే వార్తలా పరిగణించలేదు.
తెలుగులో మాత్రమే హీరోలకు, వారి స్టార్డమ్కు ఇంతగా మీడియా సాగిలపడడం కనిపిస్తుంది. మరే భాషా మీడియా అయినా హీరోలను పొగడాల్సినప్పుడు పొగుడుతుంది. వారి తప్పుల్ని సైతం ఎత్తి చూపుతుంది. అయితే తెలుగు మీడియా మాత్రం ఎంత సేపూ తెరవేల్పులంటూ కీర్తించడం తప్ప… అవసరమైనప్పుడు విమర్శించాల్సిన బాధ్యత కూడా తన మీద ఉందని గుర్తించడం లేదు.
విచిత్రమేమిటంటే… మరే రంగాన్నీ మీడియా వదలదు. చిన్న స్కూల్లో బడిపంతులు ఒక విద్యార్ధిని ఏదో సహనం కోల్పోయి బెత్తం ఝలిపించాడన్నా, పొరపాటునో గ్రహపాటునో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాహనచోదకుడిని ఓ చెంపదెబ్బ కొట్టాడన్నా… రెచ్చిపోయి మరీ ఎక్స్‌క్లూజివ్ కధనాలతో ఉతికి ఆరేస్తుంది. ఆఖరికి వ్యక్తిగత కుటుంబ విషయాలను కూడా రాచి రంపాన పెడుతుంది.
కాని ఒక్క సినిమా వాళ్ల విషయంలోనే చాలా సాఫ్ట్‌గా వ్యవహరిస్తుంది. దీనికి కారణం ఏమిటో అంతుపట్టదు. మీడియా కూడా సాధారణ ప్రేక్షకుల్లాగా తెలుగు హీరోలను నెత్తికెత్తుకున్నంత కాలం.. జనం స్టుపిడ్ ఫెలోస్ లానే వారికి కనపడతారనేది నిజం.